పుట:Gona gannareddy, Adavi Bapiraju.pdf/22

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కుట్ర

15

లకుమయ: హరిహరదేవులే కాకతీయమహారాజ్యానికి నిజమైనవారసులు. కాకతీయ మహరాజాధిరాజులైన రుద్రదేవచక్రవర్తి యాదవరాజుతో యుద్ధాలుచేసి దేవగిరిపై దండెత్తి వెళ్ళినప్పుడు, ఒక మహరాష్ట్రకన్యను వలచి, గాంధర్వ వివాహమై అనుమకొండ తీసుకువచ్చారు. ఆ దేవికి హరిహర మురారిదేవుల తండ్రి సారంగధరదేవుడు ఉద్భవించాడు. రుద్రదేవమహారాజు దేవేరికి పుత్రులు లేనందున కాకతీయ సామంత మండలేశ్వర మహాసేనాపతులు, మహామండలేశ్వరులు గాంధర్వవివాహజనితులైన సారంగదేవులను కాకతి సింహాసనం ఎక్కించక, మహదేవరాజునే ఎక్కించారు. మహదేవరాజుప్రభువు కాలధర్మం పొందగానే రేచర్ల రుద్రసేనాని గణపతి రుద్రదేవమహారాజును సింహాసనం ఎక్కించెను. సారంగదేవప్రభువు అన్నగారగు గణపతిదేవ మహాచక్రవర్తిని, భక్తితో ప్రేమతో కొలిచి, ఇప్పటికి మూడేళ్ళక్రితం లింగైక్య మందినారు. గణపతి రుద్రదేవులు ప్రేమతో కొలనుపాక విషయం పాలనకు ఇచ్చి అచ్చటినుండి, ఉత్తర రాజ్యం గోదావరీతీరం వరకూ పాలిస్తూ ఉండడానికి తమ్మునికి అనుమతి ఇచ్చినవారు. ఇప్పుడు శ్రీ గణపతి రుద్రదేవచక్రవర్తికి స్వస్థత లేకున్నదాయెను. ఆయన రుద్రదేవచక్రవర్తి అన్న నామంతో నిరుడు శాలివాహనశకం 1182 రౌద్రి సంవత్సర మాఖమాసంలో తన కుమార్తెను చక్రవర్తి సింహాసనం ఎక్కించారు. అప్పటినుండీ హరిహరదేవ మురారిదేవులకు చాలా కష్టంగా ఉన్నదని వింటున్నాము.

మారయమంత్రి: ప్రభూ! తాము నిజం తూ. చ. తప్పక, సర్వం గ్రహించారు. పురుషునకే రాజ్యార్హత ఉంది. ఏధర్మశాస్త్రంలోనూ స్త్రీ పైతృకమైన రాజ్యానికి అర్హురాలు కాదు. హరిహర మురారిదేవుల తండ్రి తన అన్నగారికి తన కొడుకులలో ఒకరిని పెంచుకోమని మనవిచేసి ఉన్నా, చక్రవర్తి వినడాయెను.

రుద్రమమంత్రి: అదంతా బలగర్వం మారయమంత్రిగారూ! నిజంగా ఆలోచిస్తే కాకతీయ మహారాజ్యం నిలిపింది రేచెర్ల వారూ, మల్యాలవారూ, గోన వారూకదా! తూర్పున నతనాటిసీమలో, కొండతూరుపు, కొండపడమటిసీమలలో పలనాడు విషయంలో, పాకనాడు, వెలనాడు, వేంగీవిషయాలలో కాకతీయులను కాపాడుతున్నది చాళుక్యులు, వెలనాటి చోడులు, కోటవారు, సాగివారు, కాయిస్థులూ కదా! అయినా, పెద్దలను రప్పించి కుమార్తె విషయమై ఆలోచించినవాడు కాడాయెను. అది చక్రవర్తి చేసిన మహాదోషము. స్త్రీ పరిపాలన చేయదలచుకొంటే చిన్నబిడ్డలకు సంరక్షకురాలుగా చేయాలి. అంతేగాని ధర్మం అడుగంటచేస్తే ధర్మాభిరతులైన సామంతులు ఊరుకోవలసిందేనా? అని మహారాజులవారు ఆలోచిస్తున్నారు.