పుట:Gona gannareddy, Adavi Bapiraju.pdf/182

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కాకతమ్మ

175

మాచయమంత్రి ‘సీతా!’ అని కేక వేసినాడు. సీత ‘ఏమీలేదండీ నాన్నగారూ! మా బావను నేను అనుకుంటున్నానండీ’ అని నవ్వుతూ బావగారిని లోనికి తీసుకొనిపోయినది.

అక్కినప్రగడకు ఇరవైమూడు సంవత్సరము జరుగుతూ ఉన్నది. అతనికి పందొమ్మిది సంవత్సరాల ప్రాయంలో మేనమామ కూతురు నిచ్చి వివాహం చేశారు. వివాహం అయిన రెండు నెలలకే అక్కినప్రగడ గోన గన్నారెడ్డి జట్టులో కలిసిపోయినాడు.

కామేశ్వరి అందాలముద్ద, విద్యావినయసంపన్న, ఇంత చిన్నతనాన్నుంచి ‘మేనత్తకొడుకే తన భర్త’ అని ఉవ్విళ్ళూరిపోతూ అతనికి తగిన పండితురాలు కావాలని దీక్షతో ఉభయభాషలయందూ పాండిత్యము సంపాదించుకొంటున్నది. పెద్దలందరూ చిన్నతనాన్నుంచీ అక్కినా కామేశ్వరీ భార్యాభర్తలన్న పేరు పెట్టనే పెట్టిరి. అక్కిన హృదయంలో అంత చిన్నతనంలోనూ మేనమామ కొమరిత, ముద్దుగుమ్మ, కామేశ్వరి సింహాసనం అధివసించి కూరుచున్నది.

మొదటినుండీగన్నారెడ్డికి ప్రాణస్నేహితుడైన అక్కిన, గన్నారెడ్డి తక్కిన మిత్రులతో మాయమై వెళ్ళిపోయినా, తన వివాహం తాతగారూ, తండ్రిగారూ తలపెట్టడంవల్ల అప్పటికి ఆగిపోయి, వివాహం గృహప్రవేశమూ, మనుగుడుపులూ అయిన వెనుక, ఒక శుభముహూర్తాన మాయమై గన్నారెడ్డి జట్టులో తానూ కలిశానని తాతగారికిలేఖ పంపినాడు. నాటికి నేడు అక్కినమంత్రి అత్తవారింటికి వచ్చినాడు. కాని ఈ నాలుగు సంవత్సరములు తాను క్షేమముగా ఉన్నాననియు, తనకు ఏమాత్రమూ వీలుచిక్కినా వత్తుననియూ మేనమామకు ఎప్పటికప్పుడు ఉత్తరములు వ్రాయుచూ ప్రతిఉత్తరములు తెప్పించుకొనుచునే ఉండెను.

కామేశ్వరి రహస్యముగా కంటినీరు కుక్కుకొనుచు, తన హృదయంలోని బాధ ఇతరులకు తెలియనీయక అన్నినోములు నోచుకొనుచు, విద్య మరిన్నీ దీక్షగా అభ్యసిస్తూ ‘భర్త ఎప్పుడువచ్చునా’ అని ఎదురుచూస్తూ ఉండెను. ఆమె భర్తను చూడగానే ఆనవాలు కట్టింది. ఆమెలో ఉప్పెనలా సంతోషము పొంగిపోయింది. ఎలా నడచి తమ భవనము చేరిందో, వెంటనే పూజాగృహములోకి పరుగిడి తమ కులదేవత అయిన కామేశ్వరికి సాగిలబడి కంటినీరు పొర్లిపోగా పరిపరివిధాల ప్రార్థించింది.

ఇంతలో మాచనమంత్రి భార్య గౌరీదేవమ్మ అల్లునికి స్వయంగా వెండి చెంబుతో కాళ్ళు కడిగికొనుటకు నీరము తెచ్చి, ‘నాయనా! ఎన్నాళ్ళకు మా యింటికి రావడం! ఎక్కడనుంచి? ఓరుగల్లులో అన్నయ్యగారూ, నాన్నగారూ క్షేమమా?’ అన్న ప్రశ్నలవర్షం కురిపించింది.