పుట:Gona gannareddy, Adavi Bapiraju.pdf/183

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

176

గోన గన్నా రెడ్డి

మాచనమంత్రి తన భవనంముందు కవచశిరశ్త్రాణాలంకృతుడై గుఱ్ఱాన్ని దిగుచున్న ఈ యువకుడెవ్వరా అని తన మేనల్లుని మొదట ఆనవాలు కట్టలేక పోయినాడు. అక్కినప్రగడ శిరస్త్రాణం తీసి చేత బుచ్చుకొని, ‘మామయ్యా! నన్నానవాలు పట్టలేదా ఏమిటి?’ అని పల్కరించగానే మాచనమంత్రి ‘నువ్వా అక్కినా’ అని వణికిపోయాడు. తక్షణమే దగ్గర వున్న సేవకులు ‘సామాను దక్షిణపు గదులలో పెట్టించండర్రా’ అని, కన్నుల తిరిగిన రెండు నీటి బొట్టులను కుడిబొటన వ్రేలితో తుడుచుకొని ‘వస్తానని వ్రాశావు కాని, ఎప్పుడు వచ్చేదీ వ్రాయలేదే!’ అని అల్లుణ్ణి ప్రశ్నించాడు. అక్కిన మామగారికి పాదాభివందనం చేశాడు.

“నేను ఎప్పుడు వచ్చేది ఎలా వ్రాయను మామయ్యా!” అనినవ్వుతూ అక్కినమంత్రి ప్రతివచనమిచ్చి. ‘సీత ఏదీ’ అని అడిగాడు.

“ఈ దినము బ్రతుకమ్మ అయిన కాకతమ్మ పండుగ - మరిచి పోయావా, అక్కినా?” అని మాచనమంత్రి ప్రశ్నించాడు.

“అవునవును, నేను మరిచిపోలేదు మామయ్యా! అయితే ఊరిబయటి ఏటికో, చెరువుకో ఓలలాడింప వెళ్ళివుంటారు. నేనూ వెళ్ళి చూచివస్తా” అని అక్కినప్రగడ లేచి అలా శిరస్త్రాణం చేతిలో ఉంచుకొనే ప్రోలసముద్రం చెరువుకు బయలుదేరినాడు. దారిలో కామేశ్వరీ, మరదలు సీతా, ఇతరులూ రావడం చూచి, తానే సిగ్గుపడి తిరిగి వచ్చేసినాడు.

మొదట తాను భార్యను ఒక్కనిమేషం ఆనవాలు కట్టలేకపోయినాడు. ఆమె తన వైపు ఒక్క క్షణికం ప్రేమనిశితాలైన చూపులు పరపేసరికి అక్కిన ఆమెను ఆనవాలు పట్టి ఆమె సౌందర్యంతో నవయౌవనభాసితయై వెలిగిపోవడం గమనించి తనలోని ప్రేమ, రాకాసుధాకరజ్యోత్స్నలులా వెల్లివిరిసిపోవ, కన్ను అరమూతలుపడ, హృదయము వేగాన నాట్యము చేయ, ఏదో దివ్యానందంలో లయమై మేనమామ ఇంటికి చేరినాడు.

అతను వేడినీళ్లు స్నానం చేస్తూ మేనమామ భవనంనిండా వెలిగింపబడిన దీపాలు గమనిస్తూ, సంధ్యావందనం ఆచరించుకుంటూ, భోజనం చేసి, లేచి మరదలు సీత అందిచ్చే తాంబూలం వేసుకుంటూ తన్నేమీ ఎరగని చిన్న మరదలిని ఒళ్ళో కూర్చుండ బెట్టుకొని, భయమూ, సిగ్గూ బాపి, తీయనిమాటలు చెప్పుతూ, పెద్దమరదలితో వేళాకోళాలు సల్పుతూ, మరదలు ప్రశ్నలకూ, మేనమామప్రశ్నలకూ ప్రతివచనమిస్తూ తన సౌందర్యనిధి, ఆత్మేశ్వరిని తలచుకుంటూ, లోపలి ఆలోచనలు ఎవ్వరికీ తెలియనీయకుండా, భార్య ఒక్కసారైనా మళ్ళీకనబడదా అనిఎదురుచూస్తూ ఉండెను.

భోజనము చేసి అత్తగారు వచ్చి ఏమయ్యా! మీ విషయం ఏమిటి ప్రజలందరూ విస్తారంగా చెప్పుకుంటారు? మీ గజదొంగల పనేమిటి? మీ నాయకుడు గోన గన్నారెడ్డి తనరాజ్యం తిరిగి స్వాధీనం చేసుకొని, రుద్ర