పుట:Gona gannareddy, Adavi Bapiraju.pdf/18

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పీటలమీది పెండ్లి

11

అతికించలేము. విఱిగిపోయినపాలు మరి తోడుకొనవు. ఈ పెండ్లి దైవవశాన చెడటం మేలే అయింది. ఎత్తుకుపోబడిన మనుష్యులు మరల దొరికినా, మళ్ళీ శుభముహూర్తం పెట్టవలసినపనిలేదు” అన్నది.

మహారాణి కుమార్తెను చూచి “అవునుతల్లీ! నాకూ మొదటనుండి ఈ సంబంధం ఇష్టములేనిదే ! పురుషుల రాజకీయాలలో మనజోక్యం ఎందుకు అని ఊరుకున్నాను!” అని నెమ్మదిగా పలికింది.

“అమ్మా! ఈ కర్కశ యుద్ధరాజకీయాలకోసం స్త్రీలను పణముపెట్టి జూద మాడటం ధర్మమా చెప్పండి?” అన్నది.

మహారాణి లేచివచ్చి ఆ బాలికను తన హృదయాని కద్దుకొన్నది. ఆమె కనుల్లో సుడిగుండాలులా నీరు తిరుగుతున్నది.

ఇంతలో దాసి ఒక్కరిత పరుగునవచ్చి, మహారాజుగారు వస్తున్నారని చెప్పింది. మహారాణియు, అన్నామాంబికయు లేచి నిలిచిరి. మహారాజు లోనికి వచ్చినాడు. తల్లికూతుం డ్రిద్దరూ ఆయనకు నమస్కారం చేశారు.

మహారాజు తానొక పీఠం అధివసించి, కుమార్తెను దగ్గరకు చేరదీసుకొని, “తల్లీ, గన్నారెడ్డి రాక్షసుడు!” అన్నాడు.

ఎవరూ మాట్లాడలేదు.

మహారాజు: మన సైన్యాలుకూడా అ దొంగలదండుకోసం పెండ్లికుమారునికోసం వెతుకుతున్నారు. దొంగలను ఓడించి వరదారెడ్డి మహారాజును త్వరలో తీసుకువస్తాము. ఈలోగా జ్యోతిష్కులు, పండితులు, కులగురువులు, పెద్దలు త్వరలో ఇంకొక ముహూర్తము ఉందేమో చూస్తున్నారు.

అన్నాంబిక: నాయనగారూ! ఒకసారి చెట్టునుంచి రాలినపండు మళ్ళీ చెట్టుమీదికిపోదు. గాలివానకు విరిగినచెట్టు మళ్ళీ బ్రతుకలేదు!

మహారాజు: అంటే నా తల్లి ఉద్దేశం?

మహారాణి: పోయిన ముహూర్తం పోనేపోయింది. తప్పిపోయిన సంబంధం భగవంతుని దివ్యేచ్ఛవల్లనే అలా జరిగింది. మళ్ళీ రాయబారాలూ వద్దు, ముహూర్తాలూ వద్దు.

మహారాజు: అమ్మాయీ?

మహారాణి: అమ్మాయి ఇష్టమే తమకు తెలియజేస్తున్నా.