పుట:Gona gannareddy, Adavi Bapiraju.pdf/167

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సప్తమగాథ

కాకతమ్మ

1

కాకతమ్మ ఉత్సవాలు శాలివాహనశక 1185 రుధిరోద్గారి సంవత్సర ఆశ్వయుజ పాడ్యమినుంచి ప్రారంభమయ్యాయి. ఓరుగల్లునగరంలో కాకతమ్మ ఉత్సవాలకు ఆంధ్రదేశం అన్ని విషయాలనుండీ లక్షలకొలది జనం వచ్చిపడతారు. ఆ సమయంలోనే ఏకవీరాదేవి ఉత్సవమూ జరుగుతుంది.

కాకతమ్మ కాకతీయులకు కులదేవత. కాకతీయ బొట్టభేతరాజు కాలానికే కులక్రమానుగతమైన ఈ గాథ ప్రచారంలో ఉంది. కాకతమ్మ గాథ ఆ దసరా పండుగలకు ప్రతిరోజూ మహారాజుల నగరంలో పాడుతూ ఉంటారు.

కాకతీదేవి పురాణకాలంనుంచీ కాకతీయ గణానికి కులదేవత. కాకతీయ గణం ఆర్య క్షత్రియ గోత్రాలలో ఒకటి. ఈ గణం వేదకాలం నుంచీ ప్రసిద్ధి కెక్కింది. ఆ పురాతనకాలంలోనే కాకతీయగణం ఆంధ్రదేశానికివచ్చి వారి దేవతను ఆంధ్రదేశంలోనూ నెలకొల్పారు. ఆ దేవతను కొలుస్తూ వచ్చిన ఒక దుర్జయ క్షత్రియవంశం శాతవాహనుల కాలంనుంచీ కాకత్య వంశంవారై చాళుక్యుల కాలంలో సబ్బసాహిర మండల ప్రభువు లయ్యారు. తూర్పు పశ్చిమ చాళుక్య రాజ్యాల మధ్యస్థమైన ఈ మండలం ఒకసారి వీరికి, ఒకసారి వారికి, ఇంకొకసారి కాంచీపుర పల్లవులకు సామంత రాజ్యంగా ఉండేది.

ఈ సబ్బిసాహిరదేశంలో గోదావరీతీరంలో ఉన్న కొఱవిదేశంకూడా ఉండేది. ఈ మండలానికి అనుమకొండ ముఖ్యపట్టణంగా ఉండేది.

బొట్టభేత మహాప్రభువు చిన్నబాలకుడై ఉన్న సమయంలో ఆయన తండ్రి అయిన ప్రోలమహారాజు దివంగతుడై నాడు. ఆ సమయంలో కాకతివంశ సామంతుడైన గాడయనాయకుని అన్న వచ్చి అనుమకొండను ఆక్రమించుకొన్నాడు.

ప్రోల మండలేశ్వరుని భార్య అనంగదేవి చిన్నకుమారుడయిన బొట్టభేత రాకుమారునితో పిల్లలమఱ్ఱి పారిపోయి కాకతీయ సామంతుడైన విర్యాల ఎఱ్ఱ నరేంద్రునికడ తలదాచుకొన్నది. ఎఱ్ఱనరేంద్రుడు కాకతీయవంశం అంటే మహాభక్తి కలవాడు. ఆతడు వెంటనే సైన్యాలు పోగుచేసుకొని, అప్పుడు కొఱవిదేశంలో ఉన్న గాడయనాయకుని అన్న కామయనాయకుని ఎదిరించి,