పుట:Gona gannareddy, Adavi Bapiraju.pdf/166

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గజదొంగ

159

అక్కడే పొంచివున్న ఇతర సైన్యాలతో విరోధుల సైన్యంమీద విరుచుకుపడడం తమలోతాము ప్రత్యేకించి ఏర్పరచుకొన్న సాంకేతికాలతో ఒకరినొకరు తెలుసుకుంటూ విరోధిమూకను చెండాడడం! ఈలా కోటను ముట్టడించిన సైన్యంలో గగ్గోలుపుట్టించి కొన్ని దళాలను నాశనం చేసివైచిరి.

కోటతలుపు తెరచి నగరకుడ్యాలదగ్గర ఉన్నసైన్యంలోకి రాక్షసులవంటి సైనికులు వచ్చి చేసినయుద్ధం అప్రతిమానం.

గన్నారెడ్డి, విఠలధరణీశుడు, సూరనరెడ్డి ఏబదిమంది వీరులతో కోటలో నుంచి కాచయనాయకునిముందే నగరంవదలి వెళ్ళిపోయారు. వా రిప్పుడు వేయిమంది అశ్వికులను వెంటబెట్టుకొని, సైన్యం ఎక్కడ పల్చగాఉన్నదో అక్కడ జొరపడ్డారు. ఆశ్వికవీరుల ప్రాణాలు ఒత్తుగాఉన్న విరోధుల ప్రాణాలు ఆకాశానకు ఎగరగొట్టుతున్నాయి. నదికి మధ్యగా ఒక హిమాలయ పర్వతం చొచ్చినట్లు వారు విరోధిసైన్యాలను చొచ్చారు. వారివెంట మూడువేలమంది ఆరితేరిన పదాతులు చొచ్చినారు.

మొదటిరాత్రే ఈలా పైనుంచి సైన్యంవచ్చి తన సైన్యాన్ని పొదుపుతుందని కాచయనాయకుడు కలలోనన్నా అనుకొనలేదు. తాను మహాగజం ఎక్కి సైన్యాలకు ఎంత ఉత్సాహం కలిగిస్తున్నా కాచయసైన్యాలు తలకొకదిక్కుగా చెదిరిపోయాయి.

గన్నయ్య గుర్రపుసైన్యం కాచయనాయకుని ఏనుగులదండును చుట్టుముట్టింది. గజయుద్ధంలో ఆరితేరిన ఆ ఆశ్వికసైన్యం, ఆ ఇరువది ఏనుగులపైన అగ్నిభాణాలుకురిపించింది. ఏనుగులు చెల్లాచెదరై పోయినవి. కాచయనాయకు డధివసించిన భద్రగజంమాత్రం విచిత్రగతులతో గన్నయ్యసైన్యాన్ని చికాకుపరుస్తున్నది. అప్పుడు గన్నయ్య మూడు అగ్నిబాణాలు అంబారిమీద వేయించాడు. ఆ వెంటనే గన్నయ్య అశ్వంమీదఉన్న తాడును అతివేగంతో అంబారీమీదకు విసిరాడు.

కాచయనాయకుని రక్షిస్తున్న అంగరక్షకులు ఆ అగ్నిబాణాలు తిరిగి విసిరి వేశారు గాని వానితోపాటు భయంకర కాలనాగంలా వచ్చిన సూత్రాస్త్రమును వారు గమనించలేదు. ఆ సూత్రం చివరఉన్న జారుముడి టక్కునవచ్చి కాచయ నాయకుని శిరస్సుపై నబడి జారి బిగుసుకుపోయింది. ఆ తాడుతోపాటు బంతిలా ఎగిరి కాచయనాయకుడు ఆ అంబారీలోనుంచి కిందకు పడిపోయాడు.

తాడు ఉరై బిగుసుకుపోయి కిందపడడంలో కాచనాయకుని ప్రాణాలు భగవంతునిలో లీనమైపోయాయి.

గన్నారెడ్డి తాడుపట్టుకొనే గుఱ్ఱాన్ని పరుగెత్తించాడు. కాచయ కళేబరము బరబర ఆతనివెంట నలుబదిబారల దూరంలో భూమిమీదకర్రలావచ్చింది.