పుట:Gona gannareddy, Adavi Bapiraju.pdf/162

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గజదొంగ

155

ఒక దినాన వుదయపూజలన్నీ నిర్వర్తించుకొని, సంతోషముతో అభ్యంతర సభాభవనంలోనికి వెళ్ళగానే అక్కడ చిన్న వెండిపెట్టె వున్నది, ఓహో! మళ్ళీ ఆ పరమాద్భుతమైన వేగు వచ్చిం దనుకొని, ఆయన ఆ మంజూషను తెరిచాడు. లోన ఒక చిన్న చుఱకత్తియున్నూ, ఒక తాళపత్ర లేఖయున్నూ వున్నవి.

“కాచయప్రభూ! కపటరాక్షసుడా! నీవు చక్రవర్తి అవుతావా? కటకం వారితో వియ్యమా? శ్రీశ్రీశ్రీ రుద్రదేవప్రభువు వట్టి ఆడదా? నువ్వు వీరాధివీర ప్రచండ దోర్బల ఘట్టనఘరట్ట గండరగండడివా? నీవు వీరాధివీర కదన ప్రచండుడవా? అభినవ మనుకుల పరశురాముడవా? పశువా! నువ్వు చాలాచోట్లనుండి చాలాధనం ప్రోగుచేశావట? ధనం వుండగానే దొంగలు రారట్రా పరశుధారీ! నేను గజదొంగనురా, నీ ధనం, నీ వీర్యధనం, నీ మానధనం అపహరించడానికే వస్తున్నానురా! ఇవన్నీ భద్రంగా దాచుకో, మహారాజాధిరాజ పరమేశ్వరుడా!” అని వున్న దా లేఖలో.

కాచనాయకుని గుండెల్లో రాయిపడింది. వెంటనే వెఱ్ఱికోపంవచ్చింది. అతని గుప్పెడుమీసాలు గాలివానకు ఊగిపోయినవి. ఆతని విశాలవక్షం భూకంపంలో భూమి పొంగినట్లుగా విస్ఫారితమైంది. వెంటనే సింహగర్జనంతో ‘ఎవ్వడురా అక్కడ?’ అని కేకవేశా డా ప్రభువు, దౌవారికుడు గజగజ వణకుతూ వచ్చి ప్రభువుఎదుట సాష్టాంగపడి లేచినాడు.

“ఏమిరా దొంగా, ఇక్కడికి ఈ వెండిపెట్టె ఎలావచ్చిందిరా? పిలు. ఈ నగరిలో కాపలా వుండేవాళ్ళందరినీ కనుక్కో. మీ వీపులమీద చర్మాలు వుండవు. వెంటనే అంతఃపుర రక్షకాధిపతిని పిలు.” అని పొలికేకలు పెట్టాడు.

9

కాచయ్య పొలికేకలలో భయంవల్ల కలిగిన కోపం వుంది. అంతఃపురరక్షకుడు, ద్వారపాలకులు, దౌవారికులు, కంచుకులు, ఆయుధరక్షకులు, రహస్యచారులు, రక్షకస్త్రీలు గడగడలాడుతూ ఆ మందిరంలోనూ బైటా నిండిపోయారు. అంతఃపురరక్షక నాయకుడు భయంతో కాచయనాయకుని ఎదుట నిలబడినాడు.

కాచ: ఏమయ్యా, ఈ వెండిపెట్టె ఈ మందిరంలోకి ఎలా వచ్చింది?

అంతః: చిత్తం మహాప్రభూ! అది ఎలా వచ్చిందో నాకు తెలియదు మహారాజా!

కాచ: ఇక నీ అంతఃపురరక్షణ ఏం తగలబడిందయ్యా?

అంతః: (మౌనం)