పుట:Gona gannareddy, Adavi Bapiraju.pdf/161

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

154

గోన గన్నా రెడ్డి

మండలేశ్వరేశ్వరుడై మహాసింహాసనం అధివసించడము ప్రజ్ఞా, పౌరుషమూతెలియ జేస్తాయనీ, అందుకు కటకప్రభువులు సర్వసహాయం చేస్తారనీ, ఆంధ్రరాజుల శిరోమాణిక్యమై అతడు కటక ప్రభువుతో వుజ్జీగావుండి వారితో వియ్యమందుట రాజలోకంలో మహాయశఃకారణ మనిన్నీ’ వేగులు పంపించారు.

కాచనాయకు డాలోచించాడు. ఆలోచించి తాను సార్వభౌముడు కావాలని నిశ్చయించుకొన్నాడు. ఆలోచన తీరగానే, ఎక్కడనుండో ఒక విచిత్రమైన వేగు వచ్చింది. ఆ వేగులో ‘ఆడదాని చేతిక్రింద నువ్వు దాసీదానవా మహారాజా?’ అనే ప్రశ్న వున్నది. కొన్ని దినాలు పోయిన వెనుక ‘సార్వభౌముడు కాటికి కాలుచాచుకొని కూరుచున్నాడు’ అని వచ్చింది. ఇంకొక వేగు ‘ఓరుగల్లునగరం నూరు గవ్యూతుల దూరంలోవుంది’ అని వచ్చింది.

వేగు తెచ్చినవా రెవరినీ కాచయప్రభువు ఎంత ప్రయత్నించినా కనుగొన లేకపోయినాడు. మంచి వెండిపెట్టెలలోపెట్టి తాటియాకు పత్రాలపైన ఆ వేగు వుత్తరాలువచ్చేవి. ఒకనాడు కాచయప్రభువునకు ఆలాంటి వేగు వుత్తరంతోపాటు ఎనిమిది లక్షల మాడల ధనంగల పెట్టెలువచ్చాయి. ‘ఈ ఎనిమిదిలక్షల మాడలు తమకు ఆడవాళ్ళరాజ్యం నాశనంచేసే వుత్తమకృషికి సన్నద్ధులయ్యేందుకు. ఈ లాంటి ప్రాభృతాలు ఇంకావస్తాయి! కాని అతిరహస్యం! జాగ్రత్తగా వుండండి మహారాజా!’ అని వున్న దా పెట్టెలలో.

కాచయప్రభువు తాను చక్రవర్తి అయినట్లు వుప్పొంగిపోయాడు. చక్రవర్తి కాబోయే అఖండ ప్రయత్నంలో నిమగ్నుడైపోయాడు.

కాచయప్రభువు పంపిన ప్రణిధులు ముప్పదిమంది మోటుపల్లి రేవుకు, కోరంగి రేవుకు జాతిగుఱ్ఱములను కొనుటకు పోయినారు. కొందరు వర్తకులు ఏనుగుల బేరమాడుటకు కటకపురికి పోయినారు. కొందరు దళపతులు కోయవారిని, శబరులను సన్నద్ధము చేయుటకు పోయినారు.

తన మహాప్రయత్నాలవిషయం ఎవరికీ తెలియకుండా కప్పిపుచ్చడానికి, తాను గణపతిరుద్రదేవుని పేర గోదావరీతీరమందు గోపాదక్షేత్రంలో నెలకొల్పిన గణపేశ్వర మహాదేవునికి కోటిఘటాభిషేకం, శ్రీశ్రీశ్రీ సప్తమ చక్రవర్తులైన గణపతిదేవ సార్వభౌముల దీర్ఘాయురారోగ్యాలకై చేయించబోతున్నానని ప్రకటించాడు. ఆ మహోత్సవానికి కాచనాయకుడు అనేక మండలేశ్వరులను ఆహ్వానించాడు.

తన ప్రయత్నాలన్నీ గోదావరిపై ఎగిరిపోయే తెరచాపలెత్తిన పడవలులా గమ్యస్థానం చేరుతున్నాయని కాచయప్రభువు మేఘాలమీద నడుస్తున్నాడు. రెట్టింపు పెరిగినట్లయ్యాడు.