పుట:Gona gannareddy, Adavi Bapiraju.pdf/134

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఓరుంగల్లు

127

“తండ్రీ! స్వధర్మమూర్తీ! ధర్మరక్షణకోసం స్త్రీ పురుషులను శిక్షించాలి. బంధించాలి. ఎలా తప్పగలదు నీ ఆదేశం? అకుంఠితమైన ఈ భయంకర ధర్మం ఎంతకాలం నిర్వర్తించగలను?

“నాలోని సౌందర్యం నాశనమైపోవుగాక! నాలోని కాంక్షలు నుసిగా రాలిపోవుగాక! నా మనోనాయకుడు నాకు దూరమగుగాక!

“రాజ్యము వదలడానికి వీలులేదు. పురుషుని వదలలేను.

“ఈ కోలనైన చక్కని నామోము, రేఖలు ప్రవహించే ఈ దేహము, పొంకాలు తిరిగిన ఈ అంగాలు కృంగి, కృశించి, కర్కశరేఖలు తాల్చి నేను కురూప నగుదునుగాక!”

14

రుద్రదేవికి కన్నులనీరు జల జల ప్రవహించింది. ఆమెకు తా నర్జునుని నిర్వేదానికి లోనయిపోయినట్లు స్పష్టంగా తెలుసును. అయినా పొంగిపొరలి వచ్చే దుఃఖాన్ని ఆమె ఆపుకోలేకపోయింది. ఆమెను ధైర్యము పటాపంచ లయింది. ఏ చెలిఅయినా, సేవకురాలయినా చూస్తూరేమో అన్న సిగ్గు, కళ్ళు తుడుచుకుంది. కళ్ళు ఎఱ్ఱబడినాయి.

అలా క్రుంగిపోయి, ఆమె దీనహృదయై ఉన్న సమయంలో, ఆ కుతప కాలంలో శ్రీ రుద్రదేవప్రభువును దర్శించడానికి శ్రీ మల్యాల కుప్పమాంబికా దేవి, అన్నాంబికాదేవితో బంగారుపొదిగిన అందలాలనుండి నగరిప్రాంగణంలో దిగారు. వెంటనే ద్వారపాలకులు వారిని సగౌరవంగా తోడ్కొని అభ్యంతర మందిరాలలోనికి తీసుకొనిపోయి స్త్రీసభామందిరంలో కూర్చుండబెట్టినారు.

ఒక దౌవారిక పోయి విద్యామందిరకవాటందగ్గర నమస్కారం చేస్తూ ‘జయ జయ! శ్రీ మహారాజులంవారికి. శ్రీ మల్యాల కుప్పమాంబికాదేవి, శ్రీ అన్నాంబికాదేవి మహారాజుల దర్శనానికి వేంచేశారు’ అని మనవి చేసింది. ఆమాట వినడంతోటే రుద్రాంబికకు ఎక్కడలేని ధైర్యమూ కమ్ముకుంది. ‘వారిని సభాగృహంలో కూర్చుండబెట్టు’ మని ఆజ్ఞాపించి లేచి, విసవిసనడచి స్నానగృహం చేరి మోము కడుగుకొని దాసి అందిచ్చువస్త్రాన తుడుచుకొని, ఆమె కుప్పాంబిక, అన్నాంబికలు కూర్చొనిఉన్న స్త్రీ సభాశాల చేరింది.

దివ్యరూపంతో వచ్చిన ఒక బాలికనుచూచి మహారాణి ముమ్మడాంబికా అనుకున్నారు వా రిరువురూ! కాని వారు ముమ్మడాంబికను చూచే ఉండిరి. అంతకన్న పొడుగరియై దేవతాకన్యలా వచ్చిన ఈ బాల ఎవరు అని వారిద్దరూ తత్ క్షణమే లేచి ఆమెకు నమస్కరిస్తూ నిలుచున్నారు. రుద్రాంబ నవ్వుతూ చరచరా వారిరువురికడకు వచ్చి ‘ఏమమ్మా, అలా తెల్లబోయి చూస్తున్నారు.