పుట:Gona gannareddy, Adavi Bapiraju.pdf/135

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

128

గోన గన్నా రెడ్డి

న న్నానవాలు పట్టలేదా?’ అని ప్రశ్నించి. ‘కూర్చోండి’ అంటూ తాను వారి ప్రక్కను అధివసించింది.

అప్పటికి రుద్రాంబమోములోని రేఖలు గమనించి, మాటలు విని వారిరువురూ ఈమె రుద్రమహారాజ్ఞి యని గ్రహించి అత్యంతాశ్చర్యం పొందినారు.

వా రిరువురూ రుద్రమహారాజ్ఞి పాదాలకు నమస్కరించినారు. రుద్రాంబిక వా రిరువురిని లేవనెత్తింది.

కుప్పాం: ఈమె అన్నాంబిక, శ్రీ కోటారెడ్డి మహారాజు కొమరిత!

రుద్ర: అవును, లకుమయ్యకుమారుని వివాహం చేసుకోవడానికి ఇష్టం లేకపోతే, మీరు ఆదవోని ప్రాంతాలకు వెళ్ళినప్పుడు మీతో పారిపోయి వచ్చిన బాలిక. అన్నాంబికాకుమారీ! నీధైర్యమూ, సాహసమూ నా కెంతో ఆనందం కలుగజేసినాయి. మీరంతా ఈ నగరం రావడమూ నాకు తెలిసింది.

కుప్పాం: మహా .... మహా .... మహా ....

రుద్ర: మహారాణీ! అని పిలువుతల్లీ! మీకు భయమేమి? నేను ఇప్పుడు రాజునూకాను, రాణినీకాను, వట్టి రుద్రమ్మను!

కుప్పాం: మహారాణీ, తమ దయ అనుపమానం! ఈ బాలికను వెంట బెట్టుకొని మేము వచ్చినదినాలలో తమదర్శనం చేద్దామని సంకల్పించుకొంటిని. కాని ఇరువురు గజదొంగల అక్కనయిన నేను తమదర్శనం చేసుకోడానికి ధైర్యం లేకపోయింది.

రుద్ర: మరి యిప్పు డెలావచ్చింది ధైర్యం?

కుప్పాం: ఈ అన్నాంబికా కుమారి నన్ను దినదినమూ వేగిరపెట్టింది మ.... మహా..... మహారాణి!

రుద్ర: (చిరునవ్వుతో) కుప్పాంబికాదేవీ! మీకు ఇంకా అనుమానం వదలలేదు. నన్ను రుద్రాంబికా అనే పిలిస్తే ఆనందం పొందుతాను.

అని ఆమె మందహాసవదన అయింది. అన్నాంబికాకుమారి ఇంతలో చటుక్కునలేచి రుద్రాంబిక పాదాలకడ మోకరించి, మహారాణీ, గన్నారెడ్డి ప్రభువు ఉత్తమవీరుడు, సుగుణసంపన్నుడు, అలాంటి ఆ ప్రభువూ, సర్వవిధాలా వారికి దీటువచ్చే విఠలధరణీశుడూ ఏలా దొంగలయ్యారో నాకు అర్ధంకాలేదు. వారు నిజంగా గజదొంగలు కారు. మహారాణులవారు తమకు సహజమైన అపార కరుణతో వా రిద్దరినీ వారి అనుచరులతో క్షమిస్తే వారంతా తమసైన్యంలో చేరుతారు. శ్రీ గన్నారెడ్డి మహారాజు తమ కుడిచేయి కాగలడు మహారాణీ! వారి నందరినీ క్షమించండి’ అని కన్నుల నీరు ప్రవహింప ప్రార్ధించినది.

రుద్రాంబికాదేవి అన్నాంబిక మోము తీక్ష్ణంగా పరిశీలించి, ఒక్క నిమిషం పక పక నవ్వుతూ అన్నాంబికను గ్రుచ్చి ఎత్తి కౌగిటచేర్చుకొని, ‘అన్నాంబికాకుమారీ! నువ్వు వట్టి బేలవమ్మా! కరిగిపోయే హృదయం నీది!