పుట:Gona gannareddy, Adavi Bapiraju.pdf/126

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఓరుంగల్లు

119

పిండితో చేసిన భక్ష్యాలు, కమ్మటి పెరుగు, ఘుమఘుమలాడు నెయ్యి - ఇవి ప్రతిదినమూ ఉండాలి. ఆంధ్రులలో రైతులు బలంకోసం జొన్నరొట్టెగాని, జొన్నన్నంగాని తింటారు. చుట్టాలువచ్చినా, పండుగ వచ్చినా రాజనాలు వండు కొంటారు.

అక్కినమంత్రి భోజనానంతరం అభ్యంతరచతుశ్శాలలో రత్నకంబళ్ళపై నధివసించి కుమారునితో, అతిథులతో తాంబూలచర్వణ చేస్తూఉండెను. కొంత కాలం విద్వత్‌గోష్ఠి జరిగింది.

ఎవ్వరూ ఎప్పుడూ, అక్కినమంత్రికడ మనుమడైన అక్కినప్రగడ విషయం ఎత్తరు. గజదొంగలలో గలసిన అక్కినప్రగడ తన మనుమడగుటకు ఆయన యెంతో బాధపడును. ఒక్కొక్కప్పుడు ఆయనకు పట్టరాని కోపంకూడా వచ్చేది.

తాంబూలచర్వణం చేస్తూఉండగా అక్కినమంత్రి సత్తముని దర్శనార్ధము కొందరు పండితులు వచ్చినారు. వారు దూరదేశాన్నుంచి వచ్చి, శ్రీ శివదేవయ్య మంత్రిగారి నగరులో వారిపంక్తిని భోజనంచేసి, అక్కినమంత్రి దర్శనార్ధము వచ్చినారు.

పదునారేడుల చిన్ననాడే దిగ్విజయయాత్రచేసి, సర్వభారతీయ పండిత ప్రకాండులచే ప్రశస్తులు పొందిన అక్కినప్రగడ ఏడని ఆ పండితులు అక్కినమంత్రిని ప్రశ్నించారు. ఆ ప్రశ్నతో అక్కినమంత్రికి మితిమీరిన కోపం వచ్చింది. ‘ఆ పాపిమాట నాకడ తీసుకురాకండి!’ అని అక్కినమంత్రి ఖండితముగా చెప్పినాడు.

ఆ పండితు లొకరిమోము లొకరు చూచుకొనుచున్నారు. అప్పుడు అక్కినమంత్రి కుమారుడు సోమయామాత్యులు, విచారమేఘావృతమైన మోముతో ఆ పండితుల చూచి, ‘మావాడు గజదొంగ అయిన గోన గన్నారెడ్డి జట్టులో కలిసి పోయాడు. ఆ దొంగకు తాను మహామంత్రి అట! అప్పటినుండి మా నాయనగారికి మతి విరిగిపోయింది. మాదుఃఖానికి మేరలేదు. పండితుడైన కుపుత్రునికంటె మూఢుడైనా, కొడుకు గుణవంతుడగుట మేలు’ అంటూ సోమయామాత్యుడు నిట్టూర్పు వదిలాడు.

అప్పు డందులో సాహిత్యవిశారదుడు, వ్యాకరణవేత్త అయిన శ్రీధర పండితుడు, రాజరాజనరేంద్ర నగరవాసి సోమయామాత్యుని చూచి ‘చిత్తం! మీ అబ్బాయిగారు గోన గన్నారెడ్డితో చేరినట్లు మాకు తెలియదు. మే మందరము కృష్ణాతీరస్థమైన ఒక అడవిలో ప్రయాణంచేస్తూ కందనోలునుంచి వస్తూఉంటిమి. కందనోలు ప్రభువు వందిభూపాల తనయుడు మమ్మెంతో ఆదరించి, విలువగల బహుమతులిచ్చి, వీడుకోలిచ్చినాడు. ఆ ప్రభువు గోన గన్నారెడ్డిని ఆకాశమంటేటట్లు పొగడారు. ఆప్రభువును వదలి మేము తుంగభద్రదాటి ఏకశిలా నగరాభిముఖంమై వస్తూ ఉంటే, కృష్ణాతీరంలో ఒక అడవిలో మమ్ము గోన గన్నారెడ్డి