పుట:Gona gannareddy, Adavi Bapiraju.pdf/125

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

118

గోన గన్నా రెడ్డి

విచారణకాలంలో ఉత్తమ పండితులు, ధర్మశాస్త్రవేత్తలు, వణిక్ సంఘాధిపతి, నగరరక్షకునకు సహాయం చేస్తూవుంటారు. అక్కినమంత్రి ఆ పండితసభలో పెద్ద. ఈ అభియోగాలు, అర్ధాన్నిగూర్చి, వాణిజ్యాన్నిగూర్చి, సామంతుల సేవకుల మధ్య తగవులగూర్చి జరుగుచునుంటవి.

ఆ దుర్మతి సంవత్సర శ్రావణమాస బహుళ పంచమినాడు శ్రీ శ్రీ మహాసామంత వర్ధమానపుర మహారాజు లకుమయారెడ్డి, గన్నారెడ్డి ఓరుగల్లులో నివసించే తమ నగరును తన భృత్యులకు స్వాధీనం చేయవలసివున్నదని పుర రక్షక ప్రభువైన ప్రసాదాదిత్యునికడ అభియోగం తెచ్చినాడు. ఈ అభియోగం తేవడానికి, విచారణసమయంలో అందులో పాల్గొనడానికి, వర్ధమానపురం నుండి లకుమయారెడ్డి రెండవమంత్రి చిన్నయామాత్యుడు వచ్చినాడు. చిన్నయా మాత్యులు, అక్కినమంత్రియు దూరపుచుట్టాలు. చిన్నయామాత్యుడు, అక్కిన మంత్రితో కొంతవరకు మాట్లాడి, ఆవిషయమై విచారణను ప్రసాదాదిత్యప్రభువు ప్రారంభించగానే చిన్నయామాత్యుడు, గజదొంగ అయిన గన్నయ్య ప్రభువు వర్ధమాన రాజ్యానికి అర్హత పోగొట్టుకొన్నాడు కాబట్టి మానువనాటి ప్రభువుల స్వత్వాలన్నీ ఆయనకూ, విఠలధరణీశునకూ పోయాయనీ, అందుచే శ్రీ శ్రీ లకుమయారెడ్డి మహారాజు తిరిగి గోనప్రభువుల నగరిని ఆక్రమించవచ్చు ననీ వాదించాడు.

ధర్మశాస్త్ర నిర్ణయాధికారులైన పండితు లా విషయం చర్చించి చిన్నయామాత్యుని వాదన అంగీకరించి శ్రీ శ్రీ లకుమయారెడ్డి ప్రభువు ఆ నగరిని స్వాధీనంచేసుకోవచ్చు నన్నారు. ప్రసాదాదిత్య ప్రభువు అంగీకరిస్తూ తీర్పు చెప్పాడు.

11

అక్కినమంత్రి వృద్ధుడైనా జవసత్వము లేమీ సడలని యోగివంటివాడు. ఆ దినమున సభ రెండవజాము పూర్తి అగుటకు ఇంకను మూడుగడియలున్న దనగానే సభ చాలింపబడినది. ప్రసాదాదిత్యప్రభువు లేచి అక్కినమంత్రి అనుమతి నంది సభ చాలించి వెళ్ళిపోయాడు.

వెంటనే అక్కినమంత్రియు మోసాలకడ శిబికనెక్కి వందులు బిరుదులు పాడ, ధవళచ్ఛత్రము, ధవళాశ్వము ముందునడువ, సామంతభేరి మ్రోగుతూ వుండగా ఓరుగల్లు మహాపురంలో తమ నగరు చేరారు. మళ్ళీ స్నానసంధ్యానుష్ఠానాలు కావించి సరిగా ప్రొద్దు పడమటివైపు మళ్ళిన ఒక ఘడియకు కుమారునితో, పండితులతో, అతిథులతో కలసి మృష్టాన్న భోజనం చేశారు.

ఆంధ్రుల భోజనం జగత్ప్రసిద్ధము. మల్లెపువ్వలవంటి రాజనాల అన్నం, పప్పు, పచ్చళ్ళు, శాకాలు, ధప్పళము, చారు, పాలతో గోధుమ