పుట:Gona gannareddy, Adavi Bapiraju.pdf/123

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

116

గోన గన్నా రెడ్డి

“మొన్ననే విక్రమసింహపురంనుంచి శ్రీ జన్నిగదేవసాహిణి మహారాజు అపరవేదవ్యాసు లనదగిన తిక్కయజ్వభారతము ఉద్యోగపర్వము పంపించారు. వాగనుశాసనుడైన నన్నయ్యభట్టు పిమ్మట ఇంత మహోత్తమకవి లేడు. తిక్కనా మాత్యులు ఏమన్నారు?

చం. 'పగ యడగించు టెంతయు శుభం బది లెస్స, యడంగునే బగం
       బగ, పగగొన్న మార్కొనక పల్కకయుండగవచ్చునే, కడుం
       దెగ మొదలెత్తిపోవ బగదీర్పవచ్చిన క్రౌర్యమొందు నే
       మిగతి దలంచినన్ బగకు మేలేమిలేమి ధ్రువంబు కేశవా!'

ఎంత లెస్సమాటలివి ?

శివదేవయ్యమంత్రి ఇలా తలపోసుకుంటూ ‘గన్నయ్య ఆ మంజూష తెరచి ఏమిచేయునో’ అనుకొనెను.

10

ఓరుగల్లు నగరంలో బ్రాహ్మణవాడ ఆవుపాలతో కడగిన ముత్యంలా ఉంటుంది. ఈ వాడలో దిగ్దంతులైన పండితులూ, వేద వేదాంగ పారంగతులూ, ఆరాధ్య నియోగిభక్తులూ, అద్వైతులైన నియోగులూ నివాసంచేస్తూ ఉంటారు. ఈ వాడ మహాపురమంత ఉంటుంది. ఈ వాడలోనివారందరికీ చక్రవర్తికొలువులో గాని, వివిధమండలేశ్వరుల కొలువులలోగాని, మంత్రులుగా, రాజోద్యోగులుగా, ఆస్థాన పండితులుగా, కవులుగా, పురోహితులుగా, గురుకులాచార్యులుగా, దేవాలయార్చకులుగా పను లుంటూ ఉన్నవి.

ఈ బ్రాహ్మణవాడలో రేచెర్ల ప్రసాదాదిత్యప్రభువునకు మంత్రిఅయిన అక్కినమంత్రి (శ్రీ అక్కినేపల్లి జానకిరామారావు జాగీర్దారుగారి పూర్వీకుడు) కౌండిన్యసగోత్రీకుడు, పిల్లలమఱ్ఱినగరవాసి, ఒక ఉత్తమభవనంలో నివాసంచేస్తూ ఉండెను. అక్కినమంత్రి పూర్వీకులు రేచెర్ల వంశానికి మంత్రులు. రేచెర్ల బ్రహ్మనాయని వంశంవారయిన శ్రీ కాటయప్రభువుకడ అక్కినమంత్రి తాతగారు సోమనా మాత్యులు మంత్రిగా ఉండేవారు. అక్కినమంత్రి తండ్రి భీమేశ్వరమంత్రి ‘శ్రీ సకలగుణాలంకార, పరనారీదూర, అమనిగింటి పురవరేశ్వర, వీరలక్ష్మినిజేశ్వర, దోర్భలభీమ, రణరంగధామ, వితరణకర్ణ, శౌర్యసౌపర్ణ, పతిహితాంజనేయ, శౌర్య గాంగేయ, సత్యరత్నాకర, దుష్టజనభీకర, మనుమకులాదిత్య, సుభటసంస్తుత్యనామాది ప్రశస్త’ శ్రీ రేచెరువుల కామిరెడ్డి ప్రభువులకు ముఖ్యమంత్రిగా ఉండెను.

అక్కినమంత్రి అన్నగారు మల్లికార్జునమంత్రి పిల్లలమఱ్ఱి ప్రభువైన నామిరెడ్డికడను మంత్రిగా ఉండెను. శ్రీ నామిరెడ్డి మండలేశ్వరుడు కామిరెడ్డిమహారాజు కుమారుడు. కామిరెడ్డి అన్నగారు బేతిరెడ్డి. ఆ ప్రభువున కొక్కడే పుత్రుడు, మల్లి రెడ్డి. అక్కినమంత్రి రేచెర్ల వంశంలో పేరుగన్న