పుట:Gona gannareddy, Adavi Bapiraju.pdf/111

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

104

గోన గన్నా రెడ్డి

సద్గురు రగడ, చెన్నమల్లు సీసములు, నమస్కారగద్యము, వృషాధిప శతకము మొదలైన గ్రంథాలెన్నో కూడా ఈ సోమనాథుడు రచించాడు.

వీరశైవులకు ఏమీ పరమత సహనములేదు. బ్రాహ్మణులను, వైష్ణవులను, బౌద్ధులను, జైనులను, చార్వాకులను వీళ్ళు కంఠోక్తిగా దూషిస్తూ, బాధిస్తూ, ఒక్కొక్కప్పుడు హతమారుస్తూ ఉండిరి.

కాని శ్రీ గణపతిరుద్రదేవమహాప్రభువులుగాని, శ్రీ రుద్రదేవప్రభువుగాని ఏమాత్రమూ ద్వేషంలేకుండా పరమతసహనం చూపుతూ ఉండిరి.

శ్రీ గణపతిదేవచక్రవర్తి మేనకోడలు బయ్యలమహాదేవి ధాన్యకటకంలో బుద్ధదేవునీ, అమరేశ్వరునీ సమంగా ఆరాధించేది. చెలికి గంగాధర మంత్రి బుద్ధుని విష్ణ్వవతారమూర్తిగాఎంచి హిడింబతీర్థములో బుద్ధదేవాలయం నిర్మించాడు.

ఓరుగల్లునగరం నిర్మిస్తూ శ్రీ రుద్రదేవమహారాజు బుద్ధదేవుని ప్రతిష్ఠ చేశాడు. ఈ దేవాలయం వీరభద్రేశ్వరుని దేవాలయం ప్రక్కనే ఉన్నది.

అనుమకొండలో కొలనిపాకలో జైనదేవాలయాలలో పూజలు విరివిగా సాగుతూ ఉండేది. గజదొంగ గన్నారెడ్డి తండ్రి బుద్ధారెడ్డి పేరు ఆయన తండ్రి బుద్ధదేవునియందున్న భక్తిచే పెట్టుకొన్నదే! రాముని భక్తిచే లకుమయ్య అని రెండవ కుమారునికి పేరు పెట్టుకొన్నాడు.

కాకతీయ సామ్రాజ్య ప్రారంభకాలంలో శ్రీ రామానుజాచార్యుడు వైష్ణవ విశిష్టాదైత్వవాదం తీసుకొని శ్రీభాష్యం రచించి లోకం అంతా ప్రచారం చేశాడు.

శ్రీ గణపతిరుద్రదేవుని కాలంలో వైష్ణవం కొద్ది ప్రాబల్యం మాత్రం కలిగి ఉండేది. అనుమకొండలో, ఓరుగల్లులో కేశవదేవాలయాలు రుద్రదేవుడు ప్రతిష్ఠించాడు. గోన బుద్ధారెడ్డి పెద్దకుమారునికి కన్నయ్య అని కృష్ణుని పేరూ, విఠలయ్య అని రెండవ కుమారునికీ పేర్లు పెట్టుకొన్నాడు.

ఓరుగల్లు చేరిన నెలదినాలకు అన్నాంబికయూ, కుప్పసానమ్మయూ శ్రీగన్నారెడ్డి కందూరుప్రభువైన కేశినాయకుని మహాయుద్ధంలో కూల్చి అఖండ విజయంసంపాదించినందుకు స్వయంభూదేవరకు, కేశవదేవరకు, మైలారదేవునకు, బుద్ధదేవునకు, వీరభద్రదేవునకు, ఏకవీరాదేవికి, కాకతిదేవికి మొక్కులు చెల్లించడానికి బయలు దేరారు.

బంగారం పొదిగి, రత్నాలుకూర్చిన శిబికలపై వీ రిరువురూ స్వయంభూదేవుని గుడి చేరి, తూర్పు హంసగోపురద్వారందగ్గర దిగారు. ఆ దినం సోమవారం. ఆ ఉదయకాలంలో ఆ గుడిఅంతా భక్తులైన స్త్రీ పురుషులతో నిండిపోయి ఉన్నది.