పుట:Gona gannareddy, Adavi Bapiraju.pdf/100

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఓరుంగల్లు

93

ఒప్పారే చిత్రశాలకు వెళ్ళింది. ఆ చిత్రశాలలో ఉన్న శివలీలా విలాసాలు గమనిస్తూ హంసతూలికల పరుపులు పరచిన దంతపుపీఠంపై అధివసించి ఆ చిత్ర లేఖనా లన్నీ అనేక రీతులుగా తన్ను గమనిస్తూ వుండగా ఆలోచనకు లోనయింది. తనభక్తికి ఆకరమైన తండ్రికిని, ప్రేమ నిధానమైన గన్నారెడ్డి ప్రభువుకు యుద్ధం సంభవించవచ్చును.

ఒకమాటు ఇక్కడ, మరొకమాటు అక్కడ నీడ వున్నచోట నిలువక, ఎండ వున్నచోట నిలిచి, తిరిగే గన్నారెడ్డి తనతండ్రిగారి ఔద్దాత్యానికి ఎన్నికష్టాల పాలవునో? తనతండ్రిగారికి పట్టుదల విపరీతము. ఈమధ్య సైన్యా లెన్నో కూరుస్తున్నారు. ఏదో భయంకరమైన సంఘటన రాబోతున్నది. ఈ సంఘటనలోగా తన తండ్రిగారికీ గన్నారెడ్డికీ సంఘర్షణవస్తే తన గతి ఏమి? ఒక వంక తండ్రి, వేరొకవంక తాను భగవంతుడుగా ప్రేమించే ప్రియుడు. వీ రిరువురు ఒకరివల్ల ఒకరు పరాభవం పొందినా, లేక నాశనమైనా తన కది ప్రాణంపోకడే అవుతుంది.

ప్రేమకై స్త్రీపురుషులు సర్వమూ అర్పిస్తారు. ఆప్రేమ ఎంత క్షణికమో అంత మహాశక్తిపూరితము. ప్రేమిస్తున్నానని, ప్రేమకై రుక్మిణీదేవి అలా తన తలిదండ్రులను, అన్నదమ్ములను అందరినీ వదలి, పురుషునితో పారిపోయింది. సీత అడవులలో భర్తతోపాటు సర్వకష్టాలు పడింది. సావిత్రి భర్తప్రాణం కోసం యముణ్ణికూడా వెంటాడింది.

స్త్రీ ప్రేమకోసం సర్వమూ త్యజిస్తే పురుషు డట్లా చేయగలడా? స్త్రీలు ప్రేమకోసం అన్నింటినీ అర్పిస్తూ ఉంటే పురుషుడు రాజ్యంకోసం అన్నీ సమర్పిస్తాడు. క్షణికమై, నశ్వరమైన ఈజీవితం భోగభాగ్యాలకోసం గజిబిజి చేసుకొనే పురుషుడు నిజము గ్రహించే ఈనాటకము ఆడుతున్నాడా?

ఈ సమస్యను, తన చరిత్రమును అంతా శ్రీ శివదేవయ్యదేశికులను కలుసుకొని తాను యిదమత్థమని తేల్చుకొంటుంది గాక.

అన్నాంబిక చిత్రశాలలో ఉన్నదని తెలిసి కుప్పసానమ్మ ఆ మందిరానికి విచ్చేసింది. అన్నాంబిక లేచి నిలిచింది.

కుప్ప: అన్నాంబికా! చాలా ప్రొద్దుపోయింది. అలసటపడి వున్నారు. మనం భోజనాదికాలు కానిచ్చి శయనమందిరాలు చేరుకుందాము.

అన్నాంబిక: ప్రయాణంలో నా కేమీ కష్టం కలుగలేదు. ఆదవోనిలో, బుద్ధపురంలో, కందనోలులో ఏమి గడబిడలు జరుగుతుంటాయో అని భయపడుతూ ఆలోచించుకుంటున్నాను.

కుప్ప: రాజకుమారీ! మా తమ్ముడు ఎవ్వరికీ ఏమీ కష్టం రానియ్యడు. అతని యుద్ధనైపుణ్యం ఎంతటిదో నీతిసంపదకూడా అంతటిదే.