పుట:Gona gannareddy, Adavi Bapiraju.pdf/101

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

94

గోన గన్నా రెడ్డి

3

శివదేవయ్యమంత్రి ఆరాధ్య ఆరువేల నియోగిబ్రాహ్మణుడు. ఉత్తమ రాజ్యతంత్రజ్ఞుడు, పండితుడు, సకలశాస్త్రపారంగతుడు, మహాకవి. శివదేవయ్య చక్రవర్తితోపాటు గోళకీమఠ శైవగురుపరంపరలోని విశ్వేశ్వర శివాచార్యులకు శిష్యుడై, తమ గురువు గుప్తమైన వెనుక తాను శివదేశికులై, రాజ మంత్రియై శ్రీ కాకతి గణపతి రుద్రప్రభునిచే ఆంధ్రమహాసామ్రాజ్యము అఖండముగ, రామరాజ్యముగ పరిపాలనము చేయించుచున్న పరమాద్భుత సత్త్వుడు. ఇసుమంతైనా రోగ మెరుగని తప్పస్సంపన్నుడు. సర్వవేదాంత సారములూ కూలంకషంగా తెలుసుకొని, శంభుమహిమను పూర్తిగా ఎరిగిన ముముక్షువు. జనకచక్రవర్తివలె రాజధర్మం అనే తామరాకులో నీటి బిందువులా ప్రకాశిస్తూ, యుద్ధంచేయని పార్థసారధిలా, కాకతీయ మహారాజ్య పరిపాలనా రథానికి చోదకుడై నడుపుతున్నాడు. ఆయనమాట గణపతి రుద్రదేవునకు శివాజ్ఞ.

ఈ నా డీ ఉత్తమపురుషుడు కళింగమునుండి కంచివరకు, మోటుపల్లినుండి కళ్యాణివరకు విస్తరించిఉన్న ఈ సామ్రాజ్యమున విచ్ఛేదక శక్తులు తాండవ మాడుచున్నవని గ్రహించాడు.

ఈ స్థితి రావడానికి తానూ ఒకవిధంగా కారకుడే! మగబిడ్డలు లేని, గణపతిరుద్రుని కూతునే కుమారునిగా పెంచుమని ఆలోచన చెప్పినది తాను ఆ బాలికకు వేరొక బాలికను తెచ్చి వివాహం చేయించింది, తాను. ఈ రహస్యం ఆలా పరమగోప్యంగా ఉండిపోవాలని తా నెప్పుడూ అనుకోలేదు.

మహారాజ్య పరిపాలనాదక్షతా, శక్తీ రుద్రదేవి సముపార్జించి సామ్రాజ్ఞి కాగోరి తా నీ రీతిగా రాజధర్మము నడిపినాడు.

ఇప్పుడు గణపతిరుద్రదేవుడు కైలాసాభిముఖుడై ఉన్నాడు. నెమ్మదిగా తన నిమంత్రణంచే, రుద్రదేవి వనిత అని లోకం అంతటా వ్యాపించింది. దీనినిగూర్చి ప్రధమంలో దేశం అంతటా గుసగుసలు బయలుదేరతీసింది తాను. మగవాడై పెరిగిన రుద్రదేవిని మరల స్త్రీగా మార్చు శక్తులను తాను ప్రయోగించాడు. అందుకు నిమిత్తుడు చాళుక్య వీరభద్రదేవుడు. ఆ నిరవద్యపుర రాజ కుమారుడు, ఇందుశేఖర మహారాజు ప్రధమతనయుడు రుద్రమదేవిని తన బుద్ధిలో ఆత్మేశ్వరిగా నిర్ణయించుకొన్నాడు. అది శుభం! ఇటు రుద్రదేవి కుమారియు చాళుక్య వీరభద్రునిపై మరులుకొన్నది. చదువుకొన్నది, ఈడు మీరినది. ఆ కుమారి కొన్ని ధర్మాలు నిర్ణయించుకొన్నది. ఇప్పు డా రాజమార్గమునుండి తప్పి నడవడానికి శంకిస్తున్నది. ఆమె దారి ఆమెయే వెదకుకొనాలి. అది ఉత్తమ ధర్మమార్గం కావాలి. ఆ అన్వేషణ క్రమ వికాసితంగా వుండేటట్లు చూడవలసింది తాను.