పుట:Gona gannareddy, Adavi Bapiraju.pdf/305

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆనందవల్లి

సామ్రాజ్యాభిషేకము

1

ఓరుగల్లులో, రాజనగరిలో, మహాసభాభవనంలో స్వస్తి. శ్రీ రక్తాక్షి సంవత్సర శ్రావణశుద్ధ పంచమీ గురువారంనాడు లగ్నమందు రవిశుక్రులూ, ద్వితీయ మందు బుధుడూ, గురువు దశమమందుండగా, శని అష్టమమందు కుజుడు భాగ్య మందుండగా శ్రీ శ్రీ శ్రీ రుద్రదేవ చక్రవర్తి సామ్రాజ్య సింహాసనాభిషేకమహోత్సవం జరిగింది.

దేశదేశాలనుండి ఉత్సాహంతో మహామండలేశ్వరులు, రాజప్రతినిధులు, మహాసేనాధిపతులు, సామంతులు, రాజబంధువులు, ఇతరదేశాల రాజప్రతినిధులు, శివగురువులు, వైష్ణవ, అద్వైత, జైన, బౌద్ధ మఠాధిపతులు, మహామంత్రులు, మహాపండితులు, మహాకవులు, రాజోద్యోగులు, వణిక్ శ్రేష్ఠులైన కోటీశ్వరులు, గ్రామ పెద్దలు మొదలయినవారు ఆ పట్టాభిషేకానికి దయచేసినారు.

ఆషాడ పూర్ణిమ ముందుగనే రుద్రదేవి, వరాహ నందిధ్వజాలు ఆకాశమూ, దేశదేశాలూ తమ కాంతులతో నింపుతూ ఎగురుతూఉండగా తన మహానగరమునకు తిరిగి వేంచేసినారు. రాగానే మహాసభ చేసిం దామె.

ఆ మహాసభలో తన కుడివైపు శ్రీ శివదేవయ్య దేశికులతో చాళుక్య వీరభద్రుని, గోన గన్నయ్యను అధివసింపచేసింది. ఎడమప్రక్క ప్రసాదాదిత్య ప్రభువు, చాళుక్య మహాదేవరాజు, మల్యాల గుండయ, మల్యాల కాటయ అధివసించి ఉన్నారు. తంత్రపాల మల్లినాయకులు, నాగమనీడు, బాప్పదేవుడు, విఠలధరణీశుడు, సూరనరెడ్డి మొదలయినవారందరు యథోచితస్థానములందు ఉన్నారు. చినఅక్కినప్రగడ శివదేవయ్యమంత్రి వెనుకనే కూర్చుండెను. ఎదురుగా ఆసనాల అధివసించి లకుమయారెడ్డి ఆదవోని ప్రభువు, వరదారెడ్డి, ఇతరులూ ఉన్నారు.

భూసురశ్రేష్ఠుల వేదాశీర్వాదాలు సభికులపై అమృతము కురిసెను.

శ్రీ శివదేవయ్య దేశికులు ఆ మహాసభను చూచి చిరునవ్వుతో ఈలా సెలవిచ్చినారు: “ఈ మహాసభలో నేను ఒక ముఖ్యవిషయం ముందుగా చెప్పాలి. మీరంతా చాళుక్య వీరభద్రమహారాజు ప్రక్కనే ఉన్న శ్రీ గోన గన్నారెడ్డి మహారాజును చూస్తున్నారుకదా! ఆయన గజదొంగ! మహాప్రభువైన శ్రీ గణపతి చక్రవర్తులవారినీ, శ్రీ రుద్రదేవ చక్రవర్తులను వ్యతిరేకించి అనేకమంది బాలకులను వెంటబెట్టుకొని ఈ మహానగరంనుంచి వెళ్ళిపోయినాడు.