పుట:Gona gannareddy, Adavi Bapiraju.pdf/304

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

విజయధ్వానం

297

రుద్ర: సరేనయ్యా! మాకు కోపంలేదు. క్షత్రియులకూ, బ్రాహ్మణులకూ కోపం నాశనహేతువు. మేము వైద్యులము. మీ రాజుకు కలిగిన రాజ్యకాంక్ష రోగాన్ని మేము నివారణచేస్తాము. మీ రాజు మాకు కోటి సువర్ణాలు, మా సేవకులకు కోటి సువర్ణాలు, మా సేనలలో హతమారినవారి కుటుంబాలు పోషణకైకోటి హోన్నుఫణాలు అపరాధము చెల్లించాలి. గోదావరీ మంజీరా సంగమంవరకు ఉత్తరపుగట్టు శౌణరాజ్యపు సరిహద్దు. అక్కడనుండి మా శాసనంఉన్న మహోపల విజయస్తంభాల గురుతున తెలుగుగ్రామాలన్నీ మా రాజ్యంలో భాగా లవుతాయి.

భవానీ: చిత్తం మహాప్రభూ!

భవానీభట్టు వెళ్ళి మహాదేవరాజు కీ సంధి నియమాలు వర్ణించగానే, ఇంతటితో బయటపడినామని, కాలిచెప్పులు వదలి కిరీటం చేతులలో నుంచుకొని పాదచారియై నడచివచ్చి రుద్రమహాచక్రవర్తి పాదాల తన కిరీటముంచి, రుద్రదేవిఎదుట సమాలింగితభూతలుడై “అష్టమ చక్రవర్తీ క్షంతవ్యుడ” ననిసన్నని ఎలుగున వచించెను.

రుద్రదేవి చాళుక్య వీరభద్రమహారాజు వైపు సాభిప్రాయంగా చూడగానే, ఆయన వచ్చి శౌణమహాదేవరాజును లేవనెత్తి, దాపుననున్న పీఠాన కూర్చుండ బెట్టినాడు.

ఈవరకే సంధినియమాల వడుపున దేవగిరికోటనుండి కోశాధికారులు ఏనుగులపై మూడుకోట్ల సువర్ణాలు, రత్నాలు బంగారు పళ్ళెరాలకొనివచ్చి రుద్రమ చక్రవర్తి పాదాలకడ ఉంచినారు.

చక్రవర్తి అనుజ్ఞాతుడై, మహాదేవరాజును ఒక సింహాసనంమీద కూర్చుండ బెట్టినారు వీరభద్రమహారాజు. చక్రవర్తి పాదాలకడనున్న కిరీటంతీసి మహాదేవరాజు తలపై నుంచినాడు పెదఅక్కినమంత్రి.

అప్పుడు వందిమాగధులు సభామధ్యమునకు వచ్చి,

‘జయ జయ శ్రీ శ్రీసమధికపంచమహాశబ్ద! జయ జయ మహామండలేశ్వర! జయ జయ పరమమాహేశ్వర! జయ జయ వినయభూషణ! జయ జయ శౌణదేశ కటక చూరకాఱ! జయ జయ మహాదేవరాయ గర్వాపహరణ! జయ జయ అనుమకొండ పురవరాధీశ్వర! జయ జయ చలమర్తిగండ! జయ జయ పరబల సాధక! జయ జయ చతుస్సముద్రవలయదిక్పూరితకీర్తి! జయ జయ రాజరాజేశ్వర! జయ జయ మూఱురాయజగదాళ! జయ జయ శ్రీస్వయంభూదేవర శ్రీపాదపద్మారాధక! జయ జయ శ్రీ అష్టమచక్రవర్తీ!’

అని జయధ్వానాలు చేసిరి. సైనికులు, దళవాహినీముఖసేనాపతులు, ప్రజలు, మంత్రులు, సభికులు జయధ్వానాలు చేసినారు.

ఆ స్కంధావారమంతా విజయధ్వానాలతో నిండిపోయెను.