పుట:Gona gannareddy, Adavi Bapiraju.pdf/306

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సామ్రాజ్యాభిషేకము

299

అలాంటి ఆ పురుషుడు శ్రీ కాకతీయ దివ్యచ్ఛత్రంక్రింద ఉండే అనేకమంది సామంతులను నాశనం చేశాడు. మనదేశానికి స్నేహితులయిన చోళుల్ని, పాండ్యుల్ని, కటకాధీశుల్ని, భల్లాణులను, యాదవులను, గాంగులను నానా చిక్కులూ పెట్టాడు. పినతండ్రిని బందీ చేశాడు.

“కాని ఈ మహావీరుడు ఈ ఉత్తమకార్యాలన్నీ శ్రీ చక్రవర్తీ అనుమతి మీదనే చేశాడు.

“ఈయన గజదొంగ కావడం శ్రీ చక్రవర్తి అనుమతిమీదనే.

“ఈ మహావీరుడు జన్మించకపోతే కాకతీయసామ్రాజ్యం విచ్ఛిన్నమై ఉండును. ‘ఆడది రాజ్యము చేయడమా’ అని సామంతు లెందరో కుట్రచేశారు. అందులో ముఖ్యులు ఆ ఎదుట ఉన్న లకుమయారెడ్డి, అందరికి వెనకాలఉండి ఏమీ తెలియనట్లు నటిస్తూ అత్యంత రాజభక్తి వెల్లడిస్తూ ఉన్న వృద్ధులైన జన్నిగదేవమహారాజూ, మేము కనిపెట్టనేలేక పోయాము. ఆయన మొన్నవచ్చి నా పాదల వ్రాలి తన్ను క్షమించమని ప్రార్థించారు. శ్రీ చక్రవర్తుల ఎదుటపడడానికి సిగ్గు పడిపోతున్నాడు. ఆ రహస్యము మాకు బయటబెట్టినది గోన గన్నారెడ్డి మహారాజే!”

అని శ్రీ శివదేవయ్య దేశికులవారు ముగించగానే, ఒక్కసారి ఆ మహాసభలో ఉన్నవారంతా జయజయధ్వానాలు చేశారు.

అప్పుడు వైతాళికులు “జయజయ శ్రీ సమస్తగుణాకర జయ! శ్రీకాకతీయ కటకసన్నాహ జయ! శ్రీ రుద్రదేవ దక్షిణభుజదండ జయ! శ్రీ కడుపులూరి పురవరాధీశ్వర జయ! శ్రీ అరిగండభైరవ జయ! సాహసోత్తుంగ జయ! శ్రీ వీరవితరణోత్సాహ జయ! శ్రీ వీరలక్ష్మినిజేశ్వర జయ! శ్రీ మనుమకుల మార్తాండ జయ! మీసరగండజయ! శ్రీ ఉభయ బలగండజయ! శ్రీ గండరగండజయ! శ్రీ అభంగ గండభేరుండ జయ! శ్రీ హన్నిబ్బరగండ జయ! శ్రీ హరిమువ్వరగండ జయ! శ్రీ లాడవకువరపెండార జయ! శ్రీ గళమౌళిసంతర్పితశశిమౌళి జయ! శ్రీ కామినీజయంత జయ! శ్రీ దుష్టతురగరేఖారేవంత జయ! శ్రీ దుర్వార వీరావతార జయ! శ్రీ కోసగిమైలితలగొండుగండ జయ! శ్రీ ఉప్పలసోముని తలగొండుగండ జయ! శ్రీ వందిభూపాలుని తలగొండుగండ జయ! శ్రీ అక్కినాయకుని తలగొండుగండ జయ! శ్రీ మేడిపల్లి కాచయనాయకుని ఉరిశిరకుండ జయ! శ్రీ కందూరి కేశినాయని తలగొండుగండ జయ! శ్రీ రాపాక భీమనిర్దూమధామ జయ! శ్రీ నిరుపమసంగ్రామరామ జయ! శ్రీ తెఱాల కాటయదిశాటపట్ట జయ! శ్రీ ఏఱువ తొండగోధూమఘట్టనఘరట్ట జయ! శ్రీబేడ చెలుకినాయని నిస్సహణాపహరణ జయ! శ్రీ సహజకార్యాభరణ జయ! శ్రీ కోట