పుట:Gona gannareddy, Adavi Bapiraju.pdf/283

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

276

గోన గన్నా రెడ్డి

ముమ్మ: నేను తంటా తెచ్చిపెట్టేదాన్నయితే నన్ను ఎందుకు పెళ్ళిచేసుకొన్నారు మగవేషంతో?

రుద్ర: నీ బాధ్యత నా ఒక్కరిదే కాదు చెల్లీ!

ముమ్మ: దేశంలో అందరిమనుష్యులదీ మీ బాధ్యతకాదా? అయినా మీరు ఎందుకు యుద్ధంలో నాయకత్వం వహిస్తున్నారు?

రుద్ర: రాజు అల్లా వహిస్తుండాలి!

ముమ్మ: రాణులుమాత్రము బాధ్యత వహించనక్కరలేదు కాబోలు!

3

రుద్రదేవి తన సేనాపతుల నందరినీ, ఆ రాత్రి తన ఆలోచనామందిరానికి పిలిపించింది.

“మీరు ఆంధ్రవీరులు, పగఱకు వెన్నియని మేటిశూరులు. విరోధిని పూర్తిగా ఓడించడానికి నెల దినాలకన్న ఎక్కువకాలం పనికిరాదు. పది దినాల లోపుగా మనం విజయం పొందగలం అని నే ననుకోను?

“మన యుద్దవిధానం మనకోటను రక్షించుకోటంకాదు అని మీరు నిస్సందేహంగా నమ్మండి. శత్రువును సర్వనాశనం చేసి ఓడించడమే మన కర్తవ్యము. అది ఒక్కటే మన ధర్మము. మన కోటబలం అందుకే ఉపయోగపడాలి.

“ఒక్క నిమేషము శత్రువునకు విశ్రాంతి తీసికొనే వ్యవధి ఈయకూడదు. గవనులు వెడలి వారి పై బడి నాశనం చేస్తూ ఉండడము, వారి ఒత్తిడి ఎక్కువైతే కోటలోకి వచ్చివేయడము! అన్ని గవనులనుండి ఒక్కసారి ముందుకు దుమికి వెనక్కు రావడం, ముందుకుపోతే జాగ్రత్తతో పోవాలి!

“ఈ నాటికి మూడవదినం శత్రువులను కంపకోటకడకు రానిచ్చి, పోరు మంచిపట్టుగా ఉన్న సమయంలో కంపకోట అంటించాలి. అంటించేముందు తక్కిన సైన్యము మట్టికోటలోనికి వచ్చివేయాలి! అగ్నిహస్తులు మాత్రం అగ్ని ముట్టించి లోపలికి వచ్చివేయండి! శత్రువు రక్షణకోసం వెనక్కు తగ్గగానే అగ్ని ఆరిపోయే సమయంలో అన్ని సింహద్వారాలనుంచి, దిడ్లనుంచీ లక్షమంది పైకురికి శత్రువును చీకాకుపరచండి, శత్రువుబలం ఎక్కువ అయ్యే విషయం మేము కోటగోడమీదనుంచి చూచి మహాకాహళాలు ఊదిస్తాము. కాహశళాల ధ్వని విని నెమ్మదిగా వెనక్కు అడుగువేయండి. పైకివెళ్ళే సైనికులందరూ శిరస్త్రాణాలపైన ఎఱ్ఱతలపాగాలు చుట్టుకొనండి. మన సైనికులు గోడదగ్గరకు వస్తూవుంటే శత్రువు మా బాణపు సేతకు రాగానే బాణవర్షం కురిసి ఆపుతాము. మన సైన్యం నిలబాటుచేసి, శత్రువును రెండవసారి తలపడండి. అప్పుడు మహా భేరీలు