పుట:Gona gannareddy, Adavi Bapiraju.pdf/282

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శివదేవయ్య

275

కోటద్వారాలన్నీ గడచి చక్రవర్తియు, శివదేవయ్యమంత్రి, చాళుక్య వీరభద్రుడూ, అంగరక్షకాదులూ, మట్టికోటకు పోయి, గోడఎక్కి విరోధుల పటాటోపాలన్నీ చూస్తూ సాయంకాలానికి తిరిగి నగరులు చేరినారు.

రుద్రదేవి శివదేవయ్య పాదాలకు సాగిలబడి ఆశీర్వచనంపొంది నగరులోనికి పోయినది. అన్నమదేవి మహారాజు నగరానికి పది గవ్యూతుల దూరంలో ఉన్నాడన్న సమయంలోనే రుద్రదేవి ఆలోచనమీద పురుషవేషం వేసికొని, మల్లికకు పురుషవేషంవేసి ఎక్కడకేని వెళ్ళిపోయెను.

ముమ్మడాంబికాదేవికూడా పురుషవేషం వేసికొని చక్రవర్తికి కుడిచేయిగా ఉండటానికి ఉబలాట పడుతున్నది. అందుకు చక్రవర్తి ఆజ్ఞ ఈయలేదు. ఆ కారణంవల్ల ముమ్మడమ్మకు ఎంతో కోపంగా ఉన్నది.

రుద్రదేవి లోపలికివెళ్ళి కవచాదులు. వస్త్రాలు ఊడ్చి, స్త్రీ వస్త్రాదులు ధరించి పూజకు కూర్చున్నది. పూజ ముగించి ‘ఈ యుద్ద పర్యవసానం ఏమవుతుందా’ అని ఆలోచనాధీనయై భోజనం చేస్తున్నది. ఆమె ప్రక్కనే భోజనంచేసే ముమ్మడాంబిక మూతిముడుచుకొని భోజనం ఏలాగో చేస్తున్న విషయం కొంతసేపటికి కాని రుద్రదేవి గ్రహించలేకపోయింది.

రుద్ర: చెల్లీ! ఏమిటా భోజనం?

ముమ్మ: నా చక్రవర్తి నన్ను ఆజ్ఞాపిస్తే నేను ఎక్కువ తినవచ్చును. కాని అది నాలో ఇమడగలదని అనుకోను.

రుద్ర: అంతకోపంవస్తే ఏమి చెప్పను? నేను మగవీరునిలా తిరిగి తెచ్చుకొనే అపయశం చాలదూ?

ముమ్మ: నన్నంటే అనండి, మిమ్ములననుకొని అబద్ధమాడకండి.

రుద్ర: సరే, నీకు అంతకోపమైతే నాతో రావచ్చును. కోటలు దాటివెళ్ళి యుద్ధం చేయవలసివస్తూ ఉంటుంది. అలాంటప్పుడు.....

ముమ్మ: అన్నాంబికను ఎల్లా పంపించారు?

రుద్ర: అన్నాంబిక విషయమూ, నీ విషయమూ ఒకటేనా చెప్పు? అన్నాంబ గన్నారెడ్డిని ప్రేమించినది. ఆమెకు ఏది అడ్డమైనా లెక్కచేయదు.

ముమ్మ: నేను మిమ్మల్ని ఒకనాడు సర్వసృష్టికన్నా ఎక్కువగా ప్రేమించాను. మీరు ఆడవారు కావడం నాదా తప్పు?

రుద్ర: సరే! సరే! నా కన్న తక్కువగా ప్రేమించేవ్యక్తి ఇక ఎవరు?

ముమ్మ: అప్పుడు మీతో ఉండాలనే కోరనుగదా!

రుద్ర: అయితే త్వరలో అలాంటి పెద్దమనిషిని వెదకాలి.

ముమ్మ: వెదకేవరకూ మీతోనే ఉండనియ్యండి!

రుద్ర: ఏమితంటా తెచ్చిపెట్టావు?