పుట:Gona gannareddy, Adavi Bapiraju.pdf/284

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శివదేవయ్య

277

మేము మ్రోగించగానే ప్రతి సైనికుడు లోపలికి వచ్చివేయవలసిందని మా ఆజ్ఞ! ఈలోగా ఆసమయంలోనే ఉభయమల్యాల సైన్యాలు గన్నారెడ్డి గజదొంగలు వెనుకనుండి శత్రువులపై ఒత్తిడి ఎక్కువ చేసేందుకు మా ఆజ్ఞ అక్కినాయక ప్రభువు మనవారికి అందిస్తాడుగాక!”

అని చక్రవర్తి గంభీరవచనాలతో సేనాపతులకు తెలియజేసి సభ చాలించినారు.

ఆ మరునాడు ముమ్మడమ్మను వీరోచితవేషం వేసికొమ్మని తనవెంట తీసుకొని శివదేవయ్యమంత్రిని దర్శించడానికి పోయి వారు తమ తపోమందిరంలో ఉండగా దర్శించి సాష్టాంగనమస్కారా లాచరించింది చక్రవర్తిని. అంగరక్షకులు ఆ దేశికుల నగరానికి సింహద్వారం కడనే ఉండిపోయినారు.

తపస్సు చాలించి ఆ పరమమాహేశ్వరుడు, పరమమాహేశ్వరి అయిన చక్రవర్తినిని, ముమ్మడమ్మను ఆశీర్వదించి “మహారాజా! మీరు నిశ్చయించిన ప్రథమయుద్ధ ప్రయోగము అమోఘమైనది. దానివల్ల శత్రువుకు కలుగబోయే నష్టము అపారము, మీరే దర్శింతురుగాక! లోకంలో ఆడువారి కులపతిత్వం ఎందుకు మహర్షులు తీసివేశారో!” అన్నారు.

రుద్రదేవి: గురుదేవా! స్త్రీకి కులపాలకత్వం మహర్షులు ఊరికేతీసివేశారంటారా? ఆలోచించే తీసివేశారు. ఎప్పుడు యుద్ధం జరుగుతోన్నదని విన్నా గజగజ వణికిపోతాను.

శివ: పిల్లవానికి ముల్లు గుచ్చుకుంటే తల్లి తీసివేయగలదా?

రుద్ర: తప్పక తీసివేస్తుంది!

శివ: పిల్ల వానికి బాధ అని ఊరుకోరాదూ?

రుద్ర: కత్తిపుచ్చుకొని కుమారునకైనా శస్త్రచికిత్స చేయగలదా బాబయ్యగారు?

శివ: పాము కరిస్తే, విషం పీల్చివేయవలసి ఉంటే తన ప్రాణనష్టాని కన్నా వెరవకుండా పీలుస్తుందికాదా తల్లి.

రుద్ర: తన ప్రాణాన్ని అర్పించడానికి, స్త్రీ ఎప్పుడూ సిద్ధమే!

శివ: తన కొడుకు ప్రాణం రక్షించడానికి, కొడుకును బాధపెట్టలేక, కొడుకును చంపివేసుకొంటుందా?

రుద్ర: (మౌనం)

శివ: కాబట్టి దేశానికి తల్లి అయిన రాణి, తనబిడ్డలయిన దేశప్రజలను రక్షించడానికీ, యుద్దం చేయడానికీ సందేహిస్తుందా?

రుద్ర: తానే, ధర్మంగా రాజ్యంచేస్తాను అనుకోడం అహంభావంకాదా?