పుట:Gona gannareddy, Adavi Bapiraju.pdf/276

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

యాదవులు

269

మానుకున్నది. యాదవుడు అఖండ బలాలు కూర్చుకొని వస్తున్నాడు. దారిలో ఎదుర్కొనుట ఓటమిని ఎదుర్కొనుటే అని శివదేవయ్యమంత్రి ప్రయత్నము మాన్పినాడు.

గోన గన్నారెడ్డి తనసైన్యాలు చాలకపోవడంవల్ల శత్రువును కొలది కొలదిగా నాశనంచేస్తూ, చీకాకుపెట్టుతూ, ఆహారపదార్థాలు అందుబాటు లేకుండ చేస్తూ ముట్టడి వదలుకొని పారిపోయేటట్లు చేయాలని సంకల్పించు కొన్నాడు.

తన యావత్తు సైన్యముతో మహాదేవరాజును వెంటాడి గన్నారెడ్డి కలిగించిన నష్టము ఇంతంతకాదు. అతని సైన్యాలకు మల్యాలవారి సైన్యాలు తోడయ్యాయి.

ముట్టడి ప్రారంభించగానే, కంపకోటలోనుండి మహాదేవరాజును నిశిత బాణవర్షము ఎదుర్కొన్నది. మహాదేవరాజు ఆ మహానగరపు కోట గోడలను చుట్టిచూచివచ్చెను. కంపకోటచుట్టు ఉన్న కందకము చిన్న ఏరులా ఉన్నది.

కంపకోటకు చిన్నచిన్న బురుజు లున్నాయి. కంపకోటకు అర్ధగవ్యూతి దూరాన మహాదేవరాజు సైన్యాలు ఆగినాయి. వెదురు, పేము, ముండ్లకంపలు, పేడతో, గంధకంతో ఆకోటగోడ నిర్మితమైనది.

వీరులు కంపకోట పైనుండి యుద్ధంచేయరు. కంపకోట వెనుకతట్టుకు ఉన్న బురుజులమీదనుండి మేటి విలుకాండ్రు శత్రువును చీకాకుపరుస్తారు. ఆ బురుజులూ కంపతోనే నిర్మిస్తారు.

శత్రువులకు కంపకోట అంటేనే భయము, కంపకోట గోడల వెనుకనుండి బురుజులమీదనుండీ శత్రువులను బాణాలచేతా, శిలాప్రయోగాలచేతా, అగ్నివర్షం చేతా చీకాకుపరుస్తూ వుంటారు. ఒకవేళ కంపకోట పట్టుబడుతుందని భయంకల్గితే ఆకోటను కాల్చి తమ నగరంలోనికి చేరుకుంటారు.

మహాదేవరాజు కంపకోటచుట్టు అర్థగవ్యూతి దూరంలో ఇరువది చిన్న కోటల నిర్మాణానికి తలపెట్టి పని ప్రారంభించెను. ఈ ఇరువది కోటలను కలుపుచు ఒక చిన్నగోడ నిర్మాణం చేయించసాగాడు. ఆ గోడకు ముందు పెద్దగొయ్యి. ద్వారాలకు ముందుమాత్రం దారులు.

కోట ముట్టడి యంత్రాలు, దూలాలు, గొలుసులు మొదలయినవి బళ్ళమీద వచ్చినవి తీసి వానిని కూరుస్తున్నారు. వెదురుతో, పేముతో అల్లిన పెద్ద దడులను ఉప్పునీళ్ళలో ఊరవేసిన తోళ్ళు బిగిస్తున్నారు. ఆ దడులే యుద్ధం సాగినవెనుక కోటగోడలదగ్గరకు వెళ్ళేవారిని అగ్నిబాణాలనుండి, రాళ్ళవర్షమునుండి రక్షిస్తాయి. ఆ దడులు నిలబెట్టేందుకు సన్నదూలాలు సిద్ధమైనవి.