పుట:Gona gannareddy, Adavi Bapiraju.pdf/277

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

270

గోన గన్నా రెడ్డి

ఏనుగులకు కవచాదులు సిద్ధమవుచుండెను. ఏనుగులమీద కోట అంబారీలు సమకూరుస్తున్నారు. గుఱ్ఱపు దళాలను రక్షించే పొడుగుడాళ్ళు బళ్ళలో నుంచి దింపుతున్నారు యుద్ధవీరులు, యుద్ధనాయకులు, దళపతులు, అశ్వపతులు, గజపతులు, ముఖపతులు నివసించే శిబిరాలు సిద్ధమౌచున్నవి. నగరపుకోట చుట్టుకొలత పదిహేను గవ్యూతు లున్నది. ఆ కొలతచుట్టు అర్ధగవ్యూతి నుండి ఒక గవ్యూతి మందముగా మహాదేవరాజు సైన్యము విడిసినది.

సేనలకు సరిపోవు ఆహారసామగ్రులుంచడానికి దండుమధ్య అక్కడక్కడ కోటగృహాలు నిర్మించారు. వానికి ఇరువది అంగల దూలములో అయిదువేల పచనగృహాలు నిర్మించారు. పచనగృహాలకు నూరు అంగల దూరములో వైద్యాలయా లున్నాయి. ఆశ్వికశాలలు, గజశాలలు వైద్యాలయాలకు నూరు అంగల దూరములో వున్నవి. ఆ పైన సేవకుల పాకలు, పందిళ్ళు, ఆ పైన స్కంధావార రక్షణపు కంపకోటలు.

నాశన మైనంత నాశనంకాగా, మహాదేవరాజు సేనలలో అయిదు లక్షల వీరు లున్నారు. దేవగిరినుండి బయలుదేరినవారు ఎనిమిది లక్షలు.

సేవకులు, వర్తకులు, బండ్లుతోలువారు, దాసీలు, వైద్యులు, మాంత్రికులు, చాకలివారు, మంగలివారు, వంటచేయువారు, ఉప్పరులు, బోయీలు, బళ్ళుతోలువారు, సూతులు మొదలయినవారు మూడు లక్ష లున్నారు, ఈ మహాజనము నంతటినీ చూచుకొని తాను వేసిన పథకమురీతిగా అన్నియు జరగడము చూచి మహాదేవరాజు జయము తనదేనని ఉప్పొంగిపోయినాడు.

తన స్కంధావారమంతా తిరుగుతూ అన్నివిషయాలు స్వయముగా మహారాజే కనుగొనుటచే వీరులకు, సేనాధిపులకు, సేవకులకు నిర్వచింపలేని సంతోషం కలిగింది.

మహాదేవరాజు వచ్చి మూడుదినా లయింది. ఇంతవరకు ఓరుగల్లులో అలికిడిలేదు. స్కంధావారం బయటా అలికిడి లేదు.