పుట:Gona gannareddy, Adavi Bapiraju.pdf/275

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

268

గోన గన్నా రెడ్డి

ఒక దినమంతా మహాయుద్ధం జరిగింది. సాయంకాలానికి అగ్నులు చల్లారెను. వెంటనే రాత్రయినాసరే సైన్యం ముందుకు సాగిపొండని మహాదేవరాజు ఆజ్ఞయిచ్చాడు. సేనలలో ఏబదివేలమంది విగతజీవులయ్యారు.

ఆ వేగం వేగంతో మహాదేవరాజు నాలుగుదినాలలో వచ్చి, ఓరుగల్లు ముట్టడించినాడు. ఓరుగల్లుచుట్టు ఒక ఇల్లుగాని, గ్రామముగాని లేదు. మురికి గోతులూ, మండే ఊళ్ళూ వున్నవి. అనుమకొండ మట్టియవాడలు పూర్తిగా కుడ్యరక్షితములై శత్రువుల రాకకు సిద్ధముగా ఉన్నవి.

5

“ఓరుగల్లు నగరం ముట్టడించిన మగవా డేడీ? ఎవరయ్యా. కన్నులు తెరచి కాకతీయమహాసామ్రాజ్య ముఖ్యనగరం తేరిపారచూడగలడా? యాదవుడా? వానికి దుర్యోగము మూడినది” అని మహదాంధ్ర ప్రజ లాడుకొనజొచ్చిరి.

గ్రామ గ్రామాలలో ఆంధ్ర రెడ్డివీరుల కందరికి రక్తము పొంగిపోయినది. చక్రవర్తి శ్రీ రుద్రదేవి వలదని ఆజ్ఞలు గ్రామాలలో సాటింపుచేయడంవల్ల, రైతు బిడ్డలు కత్తులు తీయలేదు. ఆంధ్రక్షత్రియులైన రెడ్లు, పంటవారు, మున్నూరు కాపులు, ముదిరాజువారు పళ్ళు పటపట కొరికి, తమ ఇళ్ళలో పూర్వకాలమునుంచి ఉన్న ఇరుమొనల కడ్గాలు, ఖడ్గమృగ చర్పపు డాళ్లు, భల్లాలు తీయవలసిందే, కాని అలా ఎవ్వరూ యుద్ధసన్నద్ధులు కావద్దని చక్రవర్తి ఆజ్ఞ!

ఆంధ్రశూద్రులైన చాకలివారు, మంగలివారు, గొల్లలు, వుప్పరులు, కుమ్మరులు, ఆంధ్రారణ్యజులైన బోయలు, అనాదులు, కోదులు, చెంచులు, మాలలు, మాదిగలు, ఆంధ్ర వైశ్యులైన శ్రేష్ఠులు; ఆంధ్ర బ్రాహ్మణులైన మంత్రులు, వేదవేదాంగ పండితులు; ఆంధ్ర శిల్పబ్రాహ్మణులైన పంచానులు; ఆంధ్రమతముల గురువులు శైవులు, జంగములు, ఆరాధ్యులు, కాలాముఖాచార్యులు, వైష్ణవులు, బౌద్ధులు, జైనులు అందరూ ఆంధ్ర చక్రవర్తిని అయిన శ్రీ రుద్రదేవిపై కత్తికట్టివచ్చిన యాదవుని ఖండఖండాలుగచేయ ఉగ్రులై పోయారు.

గ్రామాలలోకి యుద్ధం ఎప్పుడూ రాదు. ఆర్యనాగరికత అసుర నాగరికత విజృంభించిన పూర్వయుగాలనుంచీ ఎప్పుడూ యుద్ధానికీ, భారతీయ గ్రామానికీ సంబంధం కలుగలేదు. యుద్ధస్థలము ఇరువాగులవారు నిర్ణయించుకొని యుద్ధము చేయుదురు. కోటలచే రక్షింపబడే గ్రామాలను మాత్రము ముట్టడించుటకద్దు.

రుద్రమదేవి మహాదేవుని గోదావరీతీరంకడ ఎదురుకుందామని చూచింది కాని మహాదేవుడు ప్రతిష్ఠానపురంకడనే గోదావరి దాటడంచేత ఆ ప్రయత్నము