పుట:Gona gannareddy, Adavi Bapiraju.pdf/272

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

యాదవులు

265

గన్నయ్య: మా బావగార్లి రువురూ ప్రతియుద్ధంలోనూ అప్రతిమాన శౌర్యమూ, యుద్ధనిర్వహణదక్షతా చూపించారు.

చౌండ: వారిద్దరూ మొన్న మమ్ము కలుసుకొన్నప్పుడు మిమ్మల్ని, మీ తమ్ములను, చినఅక్కిన మంత్రులవారిని ఎంత మెచ్చుకొన్నారో?

గన్నయ్య: మహాప్రభూ! అవి అన్నీ వట్టి పొగడ్తలు. లేక భావగార్లు వేళంకోళము చేసి ఉంటారు.

కాటయ: అవి పొగడ్తలుకావు, వేళంకోళాలుకావు. వారిద్దరినీ చూచినప్పుడు నాకు నా శైశవదశనాటి మా తండ్రిగారి అద్భుత శక్తి జ్ఞాపకం వచ్చింది మహారాజా!

అక్కిన: ఆ మహారాజు మనుమలూ, తమ పుత్రులూ! తమ పరాక్రమం లోకవిదితం కాదా అండి.

చౌండ: చిత్తం, ఇక మన కర్తవ్యము?

గన్నయ్య: ప్రభూ! ఆంధ్రచక్రవర్తుల చల్లనిపాలనంలో ఆంధ్రప్రజలు కాటకాలు ఎరుగరు. ఈతిబాధలు ఎరుగరు. ఎప్పుడయితే యుద్ధాలు వస్తాయో అప్పుడే కాటకాలూ వెన్నంటుతాయి. యుద్ధం దావానలం వంటిది. ఆ దావానలం చెలరేగకుండా ఎక్కడ మంటలు అక్కడ ఆర్పివేయడం ఈ గజదొంగ కర్తవ్యం అనుకున్నా, ప్రజల సహకారంలేక రాజ్యాలు సాగవు. ప్రజలు విరోధిసైన్యాలు వస్తున్నాయంటే వారికి ఏవిధమైన సహకారం లేకుండా చేయాలి. తమ అభిప్రాయం సెలవియ్యాలి.

చౌండ: ఈ నూతనాయుధం ఎలా భావించగలిగారు ప్రభూ?

అక్కిన: బావగారు శత్రువుల నాశనంచేసే ఎత్తులు వేయడంలో కృష్ణునికే పాఠాలు నేర్పుతారులెండి!

గన్నయ్య: ఇంక యాదవుని బళ్ళకోట భస్మం చేయాలి. నూనెతో తడిసిన గుడ్డలు, ఎండిన చితుకులు నింపి, కాడులులేని బళ్ళు ఇరవై వేలయినా తాము సిద్ధము చేయించి విరోధి వచ్చే దారిలో నేలపైకి ఆ బండ్లు నలుమూలల నుంచీ దొర్లుకువచ్చే ప్రదేశాలలో సిద్ధంచేసి ఉంచాలి. దారులలో రాళ్ళూ రప్పలూ లేకుండా ఉంచాలి.

కాటయ: విరోధిచారులు ఈ బళ్ళను కనిపెట్టరా మహారాజా?

గన్నయ్య: ఈ బళ్ళు సిద్ధంగా ఉంచిన లోయలకు ఒక గవ్యూతి దూరంలో మన అశ్విక సైన్యాలు కొన్ని, విరోధుల్ని తలపడి ఘోరయుద్ధం చేస్తూ వెనక్కు అడుగులు వేస్తూ, వేగంగా బళ్ళవెనక్కు మాయంకావాలి. బళ్ళకు మంచి బరువు కట్టాలి. మన అశ్విక సైన్యాలను తరుముకువచ్చేవారి సైన్యాలమీద ఈ బళ్ళు దూకుతాయి. బళ్ళ వెనుకనుంచి మన అన్నిబలాలు దూకుతవి. ఈబళ్ళు అన్ని వైపులనుంచీ వచ్చిపడాలి.