పుట:Gona gannareddy, Adavi Bapiraju.pdf/271

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

264

గోన గన్నా రెడ్డి

బిరుదాలు పొంది ముసలి తనంలోకూడా ఏమాత్రమూ శక్తిసడలని మహావీరుడై భీష్మునివలె శత్రుజన భీకరుడై రాజ్యము చేయుచుండెను.

చౌండసేనాని కుమారుడు కాటయచమూపతి, తండ్రిప్రక్కనే నిలిచివున్నాడు. గోన గన్నయ్య అక్కినప్రగడలు మందిరములోనికి రాగానే చౌండసేనా పతి లేచి, త్వరితగతి గన్నయ్యదగ్గరకు వచ్చి, ఆత డిచ్చు నమస్కృతు లందుకొనుచు, గాఢముగా కౌగలించుకున్నాడు. అక్కిన చౌండసేనానికి జయం సలిపి వేదాశీర్వాదాలు ఒసగినాడు. వారందరు ఉచితాసనా లధివసించిరి.

చౌండ: గన్నయ్యమహారాజా; మీ తండ్రిగారు నేనంటే ప్రాణం యిచ్చేవారు. వారికి మల్యాలవంశం అంటేనే ప్రాణం. అందుకనేగా మాజ్ఞాతి గుండయ్యప్రభువుకు తమ అమ్మాయిని ఇచ్చి ఉద్వాహం చేశారు.

గన్నయ్య: మహారాజా! తాము ఇంతవృద్ధులయ్యూ మా కందరికీ సిగ్గు వచ్చే విధానంగా యుద్ధం చేస్తున్నారు.

కాటయ: గన్నయ్యప్రభూ! మా నాయనగారికి వృద్ధులమైతిమే అనే విచారం పట్టుకొన్నది. చిన్నవారుగాఉంటే, శౌణయాదవుణ్ణి గోదావరి దాట నిద్దుమా అంటారు!

అక్కిన: అది నిజం కాటయమహారాజా! దేవగిరి యాదవులు, చౌండమహారాజులు యవ్వనంలో ఉన్నప్పుడు దేవగిరిప్రాంతాలు దాటి ఆంధ్రదేశం వయిపు కన్నెత్తి చూశారా ఎప్పుడయినా?

కాటయ: ఇంతకూ యాదవుల్ని మంజీర దాటకుండా చేయలేకపోయామని బాధపడుతున్నారు.

గన్నయ్య: ప్రభూ! తాతయ్యగారూ, అలా ఆలోచిస్తే ఎట్లా? మహాదేవరాజు నేలయీనినట్లు దండుతో వచ్చాడు. ఆంధ్రయుద్ధవిధానం బాగా గ్రహించి ఎత్తుపైఎత్తులు వేసుకువచ్చాడు.

అక్కిన: కాబట్టి మనం చేయగలిగినదల్లా యాదవుల సైన్యాలు ఎన్ని నాశనం చేయగలిగితే అన్నీ చేయడమే!

గన్నయ్య: అప్పుడు చక్రవర్తి తక్కిన యాదవసైన్యాలను పిండి గొట్ట వచ్చునుగదా!

చౌండ: గన్నయ్యమహారాజా! మీరు గజదొంగలై ఆంధ్రదేశానికి చేసిన మేలు సకల ఆంధ్రావని యెప్పుడూ మరచిపోదు. మా మనుమరాలు మల్లాంబికాదేవిని మీ తమ్ములకు చేసికోవలసిందని ప్రార్థిస్తున్నాను. మా చిన్న మనుమరాలిని సూరనరెడ్డి ప్రభువుకు అర్పించదలచుకున్నాము.

కాటయ: మేమూ మీతోపాటు దొంగలమే గన్నప్రభూ! మా అబ్బాయిలు యిద్దరు, మీతో వచ్చిచేరారు.