పుట:Gona gannareddy, Adavi Bapiraju.pdf/252

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఉత్తమ చాళుక్యుడు

245

ప్రేమించుచుందురు. అట్టివారు చూచుట, ప్రేమించుట రెండును ఒకేక్షణంలో సంభవించును.

ఒకరినొకరు ఎరుగకుండగనే ఒకజన్మంలో స్త్రీ పురుషులు ప్రేమింతురు. వారు చూచుకొనుట అనగా, రహస్యముగా ప్రవహించేనది బాహ్యాన వ్యక్త మగుట మాత్రమే. దానిని ప్రేమ అని మన మందుము.

ఒక స్త్రీ తన్ను ప్రేమించిన పురుషుని చూడనేని చూడకపోవచ్చు. ఒక పురుషుడు తన్ను ప్రేమించిన స్త్రీని ద్వేషించి యుండవచ్చు, ఆ ప్రేమను గమనింపకపోవచ్చు. అప్పుడు ప్రేమధర్మము సంపూర్ణము కాలేదని నిశ్చయమేకదా! అటులయ్యు భగవంతుని మనము తెలిసికోనట్లే, భగవంతుని వ్యక్తరూపమయిన ప్రేమను తెలిసికోలేము.

చాళుక్య వీరభద్రుడు రుద్రమదేవి కాత్యాయనీదేవి అవతారమే అని నమ్మినాడు. ఆమె తన్ను ప్రేమించుట అసంభవము. అవతారమూర్తి కానిచో ఏస్త్రీ తన స్వీయస్వత్వముచే సామ్రాజ్ఞి కాగలదు? చక్రవర్తులకు కుమారులు కలుగక, బాలికలు మాత్రమున్న చరిత్ర లెన్నియో ఉండినవి. వారందరు చక్రవర్తిను లగుదురా? అట్టి పదవికి అర్హులు పుట్టుకతోనే వ్యక్తమగుట కద్దు.

పురుషవేషముతో ఉన్నప్పుడు ఆ అవతారస్వరూపమును చూచినాడు. అప్పుడామె ఒక దివ్యమూర్తిగా తనకు వ్యక్తముకాలేదా? ఆమెకు రాని భాషలు, శాస్త్రాలు లేవు. ఆమె సౌందర్య వరసీమ, అల్పుడయిన తా నెక్కడ, ఆమె ఎక్కడ? ఒక మహావంశమునకు తుదిరెమ్మలు తాను, తన తమ్ముడును. దివ్యత్వము జారిన వంశమునుండి చక్రవర్తి పదియారు చిహ్నాలూ విడిపోవును. అవి యెల్ల కాకతీయవంశమును వరించెను. ప్రతి వంశానికి చక్రవర్తిత్వ. ధనేశత్వాలు ఏనాడో వదలిపోవలసినవే. వానికి ఇంతకాల మాయుర్దాయము అని ఉన్నది. ఇక్ష్వాకువంశము, హైహయవంశము, కురువంశము, శిశునాగవంశము, నందవంశము, మౌర్యవంశము, శాతవాహనవంశము, దక్షిణేక్ష్వాకువంశము, సాలంకాయన, విష్ణుకుండిన, బృహత్పాలాయన, పల్లవచాళుక్య వంశాలు సామ్రాజ్య సింహాసనాలు అధివసించాయి, అంతరించాయి. ఈనాడు కాకతీయులు చక్రవర్తులు.

తన చేయి చూచి, జాతకము చూచి, గోపాదక్షేత్రాన కొలదికాలము నివసించిన ఒక మహాయోగి ఏమి వర్ణించినాడు? నీ వంశాన ఇంకొక చక్రవర్తి పుట్టును. ఆతనికి, నీకు విచిత్ర పితామహసంబంధ ముండును అని ఏమో! భవిష్యత్తు తనబోటి మూఢమానవులకు మూడడుగుల దూరములోఉన్నను కనబడదు కదా!

చాళుక్య వీరభద్రుడు నిదురజెందినాడు. అ మరునాడు శ్రీ రుద్ర చక్రవర్తి ముమ్మడాంబికాదేవితో కలసి వడ్డంగలకు బుద్ధగణపతిని పూజింప బయలుదేరినారు.