పుట:Gona gannareddy, Adavi Bapiraju.pdf/253

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

246

గోన గన్నా రెడ్డి

ఆ దేవుని పూజించి ఆ దిన మక్కడ విడిదిచేసి, ఆ తెల్లవారుగట్ల బయలుదేరి ఏకవీరామహాదేవీ దర్శనార్థము మొగిలిచెర్లకు పోయి అక్కడ అయిదుదినాలు అఖండార్చనలు జరిపింప నిశ్చయమైనది. శ్రీ రేచర్ల ప్రసాదాదిత్యుని కుమారుడైన రుద్రసేనాని మూడువందలమంది వీరులతో ఆమెకు అంగరక్షకుడుగా వెళ్ళినాడు.

ఆమె వెళ్ళి అయిదురోజు లయినది. చాళుక్య వీరభద్రమహారాజునకు ప్రతిదినము తన ఇష్టదేవతను చూడకపోవుటచే మతిపోయినట్లే అయినది. ఆయనకు ఏదియో ఆవేదన కలిగెను. తన దేవతామూర్తితో ఏశుంభనిశుంభులు తలపడుదురో? ఆమెను తేరిచూడజాలువా రెవ్వరు? అయినను రాక్షసత్వానికి ఉచితానుచితాలు ఏమి తెలియును? తన బలము తా నెరుంగలేని రాక్షసహృదయుడు ఏమి చేయునో! అటుపిమ్మట లోకము నెంత తలక్రిందు లొనర్చినను ఏమిలాభము?

ఆయన వేగముగా శివదేవయ్య దేశికులకడకు పోయినాడు. వారికి పాదాభివందన మాచరించి, ఉచితాసనముపై కూరుచుండి, ‘గురుదేవా! హృదయములో ఏదో గాఢమైన ఆవేదన కలుగుతున్నది’ అన్నాడు.

“రాబోయే భయంకరయుద్ధం ప్రతిఆంధ్రవీరుని హృదయంలోనూ ఆవేదన కలుగజేస్తూ ఉన్నది.”

చాళుక్య: స్వామీ! యుద్ధావేదనకన్న ఇంకనూ తీవ్రమైనదిది.

శివ: యుద్ధంలోకి ఉరికే ప్రతివారికీ ఆలాగే ఉంటుంది. మహారాజా! యుద్ధంలో ప్రవేశించిన వెంటనే ఈ ఆవేదన తీరుతుంది. అప్పడు యుద్ధతంత్రం నడిపే ఆతురత ఒక్కటే ఉంటుంది. ఈ ఆతురతా, యుద్ధపూర్వకాల వేదనా కలసి, భరింపలేని బాధ హృదయంలో కుములుతూ ఉంటుంది.

చాళుక్య: చిత్తం. కాని నా ఆవేదన యుద్ధానికి సంబంధించిందే కాదు, భగవాన్!

శివ: దాని స్వరూపం ఏమాత్రమూ తెలియదా తమకు?

చాళుక్య: చక్రవర్తి కొద్దిమంది అంగరక్షకులు కొలుస్తుండగా మాత్రమే మొగలిచర్ల గ్రామం దయచేసిఉన్నారు.

శివ: లక్షలకొలది ఆంధ్రవీరులు! ఆంధ్రనాయకులు, సుక్షత్రియులు నిండి ఉన్న ఈ ప్రదేశాలకు విరోధు లెవరు రాగలరు మహాప్రభూ!

చాళుక్య: చిత్తం. అయినా ఏదో నిర్వచింపలేని ఆవేదన భగవాన్!

శివ: ప్రభూ, మీబోటి ఉత్తములకు వట్టి ఆవేదనలు కలుగవు. నేను మహారుద్రుని ధ్యానిస్తాను.

చాళుక్య వీరభద్రుడు వారి పాదాలు కెరిగి ఆశీర్వాదమంది తన నగరు చేరెను. ఆ రాత్రిఅంతయు ఆ గాఢావేదన అణుచుకోలేకపోయెను. వఱు