పుట:Gona gannareddy, Adavi Bapiraju.pdf/251

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

244

గోన గన్నా రెడ్డి

శివ: ముందు మన కర్తవ్యం?

వీర: అవసరమైతే గన్నారెడ్డి ప్రభువుకు మనం సహాయం పంపించి మహాదేవరాజు బలం తగ్గించాలి. ఓరుగల్లు ఎంత దుర్భేద్యమైనా చాలా కాలం ముట్టడి జరుగకూడదు.

శివ: మీ ఉద్దేశ్యము మాకు అవగతమైంది. జాయపమహారాజుల వారూ! వెంటనే ఏబదివేల సైన్యము గన్నారెడ్డి సహాయానికి పంపండి. ఆ సైన్యానికి తంత్రమాల మల్లి నాయకులు నాయకత్వం వహిస్తారు. మనం దుర్గరక్షణ నిర్వహిద్దాము.

సభ పూర్తికాగానే చాళుక్య వీరభద్రమహారాజు తమ నగరు చేరిరి. గుఱ్ఱపు స్వారి, ధనుర్యుద్ధపరిశ్రమ, ఖడ్గయుద్ధము, సూర్యనమస్కారాలు చేసి స్నానము చేసి పూజసలిపి, భోజనమాచరించి, కొందరు పండితులతో శాస్త్రచర్చచేసి, ఆ వెనుక వీణావాదనము విని, రాత్రి రెండవయామమధ్యమున శయనమందిరమున కేగిరి.

తెల్లవారుటకు రెండుఘడియ లున్నదనగా తీయని మేలుకొలుపులు మురళితో ఒక గాయకుడు పాడుచుండ చాళుక్య వీరభద్రమహారాజు లేచి, కాలోచితకృత్యా లాచరించి, అలంకృతులై, సపరివారులై, నగరపాలకుడైన ప్రసాదాదిత్య ప్రభువుతో, మహాతలవరితో బయలుదేరి నగరసంచారముచేసి, సర్వ యుద్ధసన్నాహాలు, నగరరక్షణసన్నాహాలు స్వయముగా చూచి, పరిశీలించి, కావలసిన మార్పులు ఆజ్ఞాపించి ఇంటికి వేంచేసిరి.

స్నాన మాచరించి, పూజాదికము లొనర్చి, సభలోనికివచ్చి ఇష్టాగోష్టి సలిపి, రాజకీయ వ్యవహారాలు చర్చించి, భోజనానికి దయచేసిరి. ఆయన పంక్తిలో సేనాపతులు, రాజబంధువులు - ఎవరో పదునైదుగురు ఎప్పుడూ ఉండవలసినదే!

భోజనానంతరము తాంబూలచర్వణకాలమందు మరల గాంధర్వ గోష్ఠి ఇతరుల నగరులకు అతిథి అయినప్పుడుమాత్రము నర్తకీమణుల నృత్యగోష్ఠి చిత్తగింతురు. తమ ఇంటిలో స్త్రీ లుండ గూడదని నిషేధించిరి.

2

చాళుక్య వీరభద్రమహారాజు రుద్రమదేవి రాజ్యపాలనము నిష్కంటకము చేసి తాను హిమాలయాలకు పోవుటే యుక్తమని నిశ్చయించుకొనెను. తాను సామ్రాజ్ఞి ని ప్రేమించినాడు. ఆమె తన్ను ప్రేమించుట ఎట్లు? ఒక స్త్రీ తన్ను ప్రేమించగలదని ఆశపడు పురుషుడు ఉత్తమహృదయము కలవాడు కాడు; స్త్రీ పురుషులు ఒకరికొర కొకరయినప్పుడు ప్రేమింపజేయు నవసరమేమి? ప్రేమ అద్యంతరహితము. ప్రేమికులు ఒకరినొకరు అనాదిగా జన్మజన్మలుగా