పుట:Gona gannareddy, Adavi Bapiraju.pdf/243

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

236

గోన గన్నా రెడ్డి

ప్రజాసంసారము ఆయన నిర్వహించగలడు. స్త్రీ ఏమి? పురుషుడేమి? వారి సంసారమేమిటి? అన్నప్రశ్న ఆలోచించడానికే ఆయనకు భయం.

తన మంత్రి, స్నేహితుడు అగు అక్కిన యుద్ధంకాగానే అత్తవారింటికి పరుగెత్తినాడు. యుద్ధసమయంలో మూడుదినాల కొకపర్యాయం చారులచే మామగారికి, భార్యకు కమ్మలు పంపేవాడు. భార్యను కలుసుకున్నప్పటి నుండి అక్కిన పూర్తిగా మారిపోయాడు. అంతకుపూర్వం సూర్యరశ్మిలా ఉన్నాడు. ఇప్పుడు వట్టి వెన్నెల్లా మూర్తితాల్చాడు. యుద్ధంలో ఇదివరకు ప్రాణలక్ష్యం లేకుండా పోరాడేవాడు. ఇప్పుడు జాగ్రత్త ఎక్కువయింది.

ఓరుగల్లులో అక్కినచరిత్ర దశకుమారచరిత్రలో ఒకకథవంటి దయింది. చక్రవర్తి పేరన చినఅక్కినను ఆయన తాత బందీచేశాడు. అతన్ని కారాగృహంలో ఉంచవలసిందని నగరపాలకుడగు ప్రసాదాదిత్య ప్రభువునకు మనవి చేసెనట. ఆయన ఈ విషయంలో తమకు సన్నిహిత సంబంధం ఎక్కువ ఉండటంవల్ల కార్యనిర్ణయభారం ముఖ్యమంత్రిపై నిడెనట.

శివదేవయ్య దేశికులు, ఆ భార్యాభర్త లిద్దరికి యింటిలోనే బంధనమని ఆజ్ఞ పంపించారట. ఆ ఆజ్ఞ వచ్చిన మూడవదినాన భార్యాభర్త లిరువురూ కావలి కాచే వీరభటుల కన్నుగప్పి, ప్రోలేశ్వరము పారిపోయి వచ్చారట. అక్కడ భార్యను వదలి అక్కిన తన్ను కలుసుకున్నాడు.

రాజవ్యవహారాలు మాట్లాడేటప్పుడు తక్కతక్కిన సమయాలలో అక్కిన ఏదో విధంగా తన భార్యాప్రస్తావన వచ్చేమాటలే మాట్లాడుతాడు. స్త్రీ ఎలాంటి వీరుణ్ణయినా భీరువును చేస్తుందికాబోలు!

గోన గన్నారెడ్డి అక్కినను తలచుకొని అసహ్యించుకొన్నాడు. అక్కినకు ఈ మధ్య కవిత్వపు వెఱ్ఱి ఎక్కువైంది. ప్రొద్దస్తమానమూ గాథాసప్తశతి, శృంగార శ్లోకాలు చదువుతున్నాడు.

ఒక దినాన వారిద్దరికి జరిగిన సంభాషణలో అక్కిన అన్న ముక్కలు చటుక్కున జ్ఞాపకం వచ్చినవి గన్నారెడ్డికి.

“బావగారూ! జీవితానికి పరమావధి మోక్షం. మోక్షానికి దారి జ్ఞానపూర్ణ భక్తి. భక్తికి ఉత్తమరూపం కావ్య సంగీత, నాట్య, చిత్రశిల్పాది విద్యలు. ఈ విద్యలకు ప్రాణం రసము. ఈ రసాలలోకి మకుటము శృంగారరసము. అది తెలియడానికి స్త్రీని ప్రేమించాలండీ!” అని

సంతానంకోసం స్త్రీని కామింపవచ్చును. అది మానవజీవిత యుద్ధంలో ఒక వ్యూహరచనవంటిది. వివాహం ఒక సంస్కారం. ఇష్టమున్నట్లయితే ఆ సంస్కారం నెరపవచ్చును; లేకపోతే బ్రహ్మచారిగా ఉండవచ్చును. పున్నామ నరకం తప్పించుకొనటానికి పెళ్ళిచేసుకునేవారు చేసుకోవచ్చును.