పుట:Gona gannareddy, Adavi Bapiraju.pdf/244

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కృష్ణవేణి

237

కావ్యాలలో నాయికా నాయకులు పరస్పరం చూడగానే ప్రేమించారు. కాళిదాసాదులు రచించిన కావ్యసౌందర్యాలేగాని జీవితసత్యా లెట్లాఅవుతాయి?

ఈ ప్రశ్న మనస్సులో ఉదయించగానే, గన్నారెడ్డి పక్కున నవ్వు వచ్చింది.

14

గన్నారెడ్డి పక్కున నవ్వగానే ఆ ప్రక్క కొంచెం దూరంగా కూర్చుండి తన పెద్ద కళ్ళతో మధ్యమధ్య గన్నారెడ్డిని చూస్తూఉన్న విశాలరెడ్డి ఆశ్చర్యముతో,

“ప్రభూ, ఎందుకు అలా నవ్వుతున్నారు?” అని ప్రశ్నించాడు.

గోన గన్నారెడ్డి ఉలిక్కిపడి, స్త్రీకంఠంలా విని ఆ బాలుని మోము తేరిపారచూచి, ‘ఎక్కడనో చూచినట్లు ఉంది! నువ్వుకూడా ప్రేమ అనే శక్తి ఒకటి ఉందని నమ్ముతావా?’ అని ప్రశ్నించాడు.

విశా: నమ్ముతాను ప్రభూ!

గోన: ఎలా నమ్ముతావు? నీకు తార్కణం ఏముంది?

విశా: నేనూ జీవితంలో కొన్ని ప్రేమసంఘటనలు దర్శించాను.

గోన: నీ యీడు?

విశా: పందొమ్మిది ఏళ్ళు.

గోన: నిన్ను చూస్తే పదారేళ్ళ బాలకునిలా ఉన్నా, నీ విక్రమం మాత్రం ఈడును మించినదయ్యా!

విశా: నన్ను పొగడకండి మహారాజా!

గోన: నేను పొగడేవాణ్ణికాను. ప్రేమవిషయంలో నీ అనుభవమేమిటి?

విశా: మహాప్రభూ! నాజీవితంలో ప్రేమ అనే ఒక విచిత్రశక్తి ప్రవేశించింది. అంతవరకూ మీకు మనవిచేయగలను. తక్కిన విషయాలు రహస్యమైనవి.

గోన: నాకు ప్రేమ విషయం చెప్పవయ్యా వీరబాలుడా అంటే, నీ ప్రేమను గురించి చెప్పమని నేను కోరటంకాదు. మన అక్కిన ‘ప్రపంచములోని శక్తులన్నిటికన్న ప్రేమ అనేది మహోత్తమ, మహత్తర శక్తి’ అని వాదిస్తాడు.

విశా: ఆయనమాట నిజమనే నా నమ్మకం.

గోన: ఎట్లా?