పుట:Gona gannareddy, Adavi Bapiraju.pdf/242

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కృష్ణవేణి

235

మాత్రము తన రహస్యనగరంలోనే ఉన్నాడు. విఠలధరణీశుడు తన అక్క కుప్పమాంబాదేవిని, బావ గుండయమహారాజును చూడడానికి వెళ్ళాడు.

ఆంధ్రదేశంలో స్వతంత్రత సంపాదించుకొందామని ఆశించిన సామంతులలో కొందరు నాశనం అయ్యారు. కొందరు దాసోహమన్నారు. కొందరు పారిపోయి దేశాలు పట్టారు. తన గజదొంగతనం ఇక దేశానికి అవసరం లేదా కృష్ణవేణీ అని ప్రశ్నించుకుంటూ ఏదో నిర్వచింపలేని హృదయవేదనలో గన్నారెడ్డి కృష్ణఒడ్డున కూరుచున్నాడు. ఆయన మౌనం బరువుగా కృష్ణానదీ జలాలలోనికి ప్రవహిస్తున్నది. ఆయన ప్రక్క నీలజలాలను పారకించి చూస్తూ గోన గన్నారెడ్డికి అంగరక్షకుడై న విశాలరెడ్డి ప్రక్కనే కూరుచుండి ఉన్నాడు.

వీరిద్దరికి దూరంగా నీళ్ళలో కాళ్ళుఆడిస్తూ ఆ బాలుని స్నేహితుడు మల్లికార్జుననాయకుడు ఒక బండరాతిమీద కూర్చొని అన్నాడు.

వేసంకాలపు మత్తు ఆ నదిమీదనుండి ప్రసరించే గాలిలో నిండి ఉన్నది. అడవిపూవుల సువాసన ఆ మత్తుకు ఇంకను భారము సమకూరుస్తున్నది. ఆ పరీమళములు నీటి పరీమళాలు, చిగురులసౌరభాలు, మోదుగపూలు, తంగేడులు ఆ ప్రదేశాన్ని వైకుంఠవనంగా చేస్తున్నవి. వేసవి సాయంకాలాలలో, శీతకాలపు రాత్రులలో, వానకాలపు పగళ్ళలో, వసంతకాలపు దివారాత్రాల పొడుగునా స్వప్నాలు లోకం అంతటా ప్రసరిస్తూ ఉంటాయి. గన్నారెడ్డి హృదయంలోనికి మూడు స్వప్నాలు ఒక్కసారిగా చొచ్చినాయి.

తాను వర్థమానపుర సింహాసనం అధివసించి తన రాజ్యం యావత్తూ నందనవనసదృశం చెయ్యాలని ఒక కల, రెండవ స్వప్నం తన చక్రవర్తి మహసభలో సర్వదేశాలవారు రుద్రచక్రవర్తి పాదాల తమ తమ కిరీటకాంతులు వెలిగింపగా నమస్కారాలు సలిపి జయధ్వానాలు పలుకుతూ ఉండగా చూడాలని. మూడవ స్వప్నానికి స్పష్టత లేదు రాసిపోసిన పూలకు రూపములేనట్లు ఆ స్వప్న మొక కదంబము. దూరాన ప్రత్యక్షమయ్యే ఒక ప్రకృతిదృశ్యం; రేకలులేని ఒక వెన్నెలప్రవాహము. దరులుముంచెత్తే సువాసనల వాన. ఒక మధుర ప్రళయం.

యుద్ధం అతనికి సుపరిచితం. యుద్ధంలో ఆతని బుద్ధి నిశితము. ఆతనిశక్తి నిరుపమము. అతనిధాటి అప్రతిహతము. మనస్సు వినిర్మలము,

యుద్ధవ్యవహారాలు, రాజకీయాలు, వ్యవసాయము, పరిపాలన ఆ యువకునకు బాగా తెలుసును. చదువుకున్నాడు. కాని మతాలు, ధర్మాలు, తత్వవిచారణ, పరలోకము వీనినిగూర్చి ఆ ప్రభువు ఎప్పుడూ ఆలోచించలేదు. రాచరికము,