పుట:Gona gannareddy, Adavi Bapiraju.pdf/238

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కృష్ణవేణి

231

గన్నారెడ్డి అశ్వికదళాలతో చోళసైన్య మధ్యమును తాకినాడు. చోళసైన్య పృష్టాన్ని రేచర్ల చినదామానాయుడు తాకినాడు. విఠలధరణీశుడు చోళసైన్యాల ఎడమభుజము తాకినాడు. ఓరుగల్లునుండి భార్యతో పారిపోయివచ్చి గన్నారెడ్డి సైన్యాలను కలుసుకొన్న అక్కినప్రగడ ఒకవైపునా, విరియాల సబ్బనాయకు డొకప్రక్కనా నదిలోని ఏనుగుల యూధాలను తాకినారు. కృష్ణ కీవలిఒడ్డున సూరనరెడ్డి సైన్యాలు గట్టుఎక్కే ఏనుగుదళాలను వెనుకకు త్రిప్పి నదిలోకి దిగి ఆవలిగట్టున ఉండే ఏనుగులపై విలుకాండ్రను ‘ఒక్కా ఓ చెలియా’ అంటూ ఆక్రమించి ప్రాణాలు హరిస్తున్నవి.

“గన్నారెడ్డి! గన్నారెడ్డి!” అని చోళసేనలలో గగ్గోలుపుట్టింది. కొండలలో యుద్ధమన్న గన్నారెడ్డికి చెలగాటము. అతనికి వేలకొలది చెంచులు సహాయము!

మూడుదినాలు రాత్రింబగళ్ళు సంకులసమరము ప్రవర్తిల్లెను. సబ్బ ప్రభువు అక్కినప్రగడలు నదిలోదిగిన వేలకొలది గజాలను తిరిగి తరిమికొట్టిరి. కొన్ని నాశనమైపోయాయి. కొన్ని తమ సైన్యాలమీదే విరుచుకుపడినాయి. చెట్లు, గుబురులు, గుట్టలు, రాళ్ళు గన్నారెడ్డికి పెట్టనికోటలు.

చోళసైన్యాలకు కలిగిన నష్టము విపరీతము. గన్నారెడ్డి వీరులలో వేలకొలది మడిసినారు. చోళసైన్యాలు పలుచబడిపోయినవి. గజములను నాశనముచేసే విధానము గన్నారెడ్డికే తెలియును. వచ్చిన గజములలో వేలకొలది యుద్ధభూమికి బలి అయిపోయినవి. రాజేంద్రచోడుడు నాల్గవనాటి ఉదయము హతశేషమయిన సైన్యాలతో త్రిపురాంతకము దారిని పారిపోయినాడు.

నూతనంగా గోన గన్నారెడ్డి జట్టులో చేరిన ఆ బాలుడు గన్నారెడ్డికి అంగరక్షకుడుగా నుండి తననేర్పు ప్రకటించెను. ఆ బాలకుడు, వాని స్నేహితునితో గన్నారెడ్డిచుట్టు దుర్గమై నిలిచినాడు. జీవకవచమై కాపాడినాడు. గన్నారెడ్డిని రెండుసారులు తనప్రాణమునొడ్డి కాపాడెను. ఒకసారి ఒక ఏనుగు గన్నారెడ్డిపై బడెను. గన్నారెడ్డి గుఱ్ఱము ఆ తాకును తప్పుకోలేకబోయే సమయములో, ఒక శవము తగిలి తూలిపోయింది. మరు నిమిషములో గన్నారెడ్డి తూలి క్రింద పడినాడు. ఆ క్షణములో ఆ ఏనుగు గన్నారెడ్డిపై కాలు వేయబోయెను. అంతట అ నూతన బాలుడు మెరుపువేగాన గన్నారెడ్డికడకు ఉరికి ఏనుగు కాలును ఖడ్గమున కెరగావించెను. ఆ గజము కోపముతో ఈ నూత్నశత్రువును హతమార్పనెంచి తదభిముఖముగా రెండు అడుగులు వేసెను. ఇంతలో గన్నారెడ్డి చెంగున లేచి, ప్రక్కనే నిలిచియున్న తన గుఱ్ఱముమీది కెగిరి ఒక్కయమ్మున మావటీని ప్రాణాలు దివి కెగురవేసినాడు. మావటీడులేని ఏనుగు వెనక్కుతిరిగి పారిపోయెను.