పుట:Gona gannareddy, Adavi Bapiraju.pdf/237

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

230

గోన గన్నా రెడ్డి

భల్లాయుద్ధములతో, నలుగురు, ముగ్గురు, ఇరువురు వీరులను దాల్చి, మహా ప్రళయమువలె కదలివచ్చుచున్నవి.

ఆ సేనను పొదవికొని పదాతులు, ఇటు, నటు అశ్వికసైన్యాలును, వెనుక రథములు, ఆ వెనుక ఎడ్ల బళ్లు, సామానులు మోయు ఎడ్లు, గాడిదలు, గుఱ్ఱాలు, సాధారణ జనసమూహం, ఇట్లు చోళసైన్యము పదునయిదు గవ్యూతుల పొడవున, అయిదు గవ్యూతుల వెడల్పున వచ్చుచున్నది.

అడ్డులేని ఆ చోళయుద్ధయాత్ర గమనించుచు హిమపర్వతమువంటి ఏనుగును అధివసించి రాజేంద్రచోడ చక్రవర్తి ఠీవిగా వచ్చుచున్నాడు.

ఆ గజయూధాలలో మొదటివరుస కృష్ణఒడ్డున చేరెను. వసంతకాలపు కృష్ణ కృశాంగియై, కొండలలో, రాళ్ళలో, ఇసుక తిన్నెలలో చిన్న చిన్న పాయలుగా జలజలా ప్రవహిస్తున్నది.

రాజేంద్రచోళునికి ఆంధ్రప్రతాపము, యుద్ధరచనాశక్తి పూర్తిగా తెలియును. కావుననే అతని చార సైన్యాలలో కొన్నిదళాలు ఏనుగులకన్న ముందుగనే కృష్ణ దాటే సైన్యాలను రక్షించుటకు వేయి ఆరితేరిన గజాలపై, నాల్గువేల విలుకాండ్రు సిద్ధముగా నున్నారు.

కృష్ణదాటిన చారసైన్యాలు ఈవలిఒడ్డు నిరాటంకము అని తెలుపుచు కొమ్ము లొత్తిరి. కాపుగా ఉంచిన వేయి గజాలుకాక, తక్కిన ఏనుగులు మూడు గవ్యూతుల వెడల్పున కృష్ణలోకి దిగినవి.

ఇంతలో బ్రహ్మాండము పగులునాట్లు అర్పులతో, రుంజల మ్రోతలతో, అల్లల్లభేరా అను పెడబొబ్బలతో ఏబదివేలమంది అవక్రపరాక్రములై న ఆంధ్ర వీరులు చెట్లపై నుండి, గుట్టలపై నుండి, రాళ్ళ ప్రక్కలనుండి లేచిరి. నదిలోనికి దిగిన ఏనుగులపైకి నూనెగుడ్డలుకట్టి వెలిగించిన కాగడాలుగల బాణాలు సువ్వు సువ్వున మహావేగంతో గురిచూచి వేయ ప్రారంభించినారు. గట్టుమీద కాపున్న ఏనుగులను ఆ వైపునుండి ఇరువదివేల సైనికులు అగ్నిబాణాలతో ఎదుర్కొనిరి. ఆ గంధకబాణాలకు నిశితమైన మొనలుగూడ నున్నవి.

ఆ రీతిగానే ఎడమవైపున ఇరువదివేలమంది పోటరులు తాకిరి.

నదిలో దిగిన ఏనుగులు ముందుకు సాగలేక వెనుకకు వెళ్ళలేక అటు ఇటు చెల్లాచెదరై పోవుట కారంభించినవి.

రాజేంద్రచోడుడు ఏనుగుల నిలబెట్టుటకు మహాప్రయత్నాలు చేయుచుండెను. నదిఒడ్డునఉన్న సైన్యాలలో ఒకభాగము తమ్మెదిరించువారిని తలపడవల వచ్చెను. అటులనే ఎడమభాగపు సైన్యమూ చేయవలసివచ్చెను. మధ్యనున్నవారు మాత్రమే నదిలో దిగినవారిని రక్షించుకోగలరు. ఆ స్థితిలో నదిలోఉన్న సైన్యాలను దిగువను, ఎగువను అయిదువందల చొప్పున ఏనుగు దళాలు వచ్చి తాకినవి.