పుట:Gona gannareddy, Adavi Bapiraju.pdf/239

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

232

గోన గన్నా రెడ్డి

గన్నారెడ్డి చిరునవ్వుతో ఆ బాలుని ‘ప్రాణదాతా!’ అని మెచ్చుకొని ముందుకురికినాడు.

12

గోన గన్నారెడ్డి రాజేంద్రచోడుని సైన్యాలు వెనుకకు మళ్ళగానే, తన సైన్యాలను కూర్చుకొని అందరకు బహుమతులు, విజయబిరుదావశులు సమర్పించి మరల సైన్యాన్నంతటినీ సుసంఘటితముచేసి, రాజేంద్రచోడుని పూర్తిగా దాసోహ మనిపించుటకు బయలుదేరెను. రాజేంద్రచోడుని, మూడుచోట్ల తలపడి పూర్తిగా ఓడించినాడు. రాజేంద్రచోడుడు వేయి ఏనుగులు, పదివేల గుఱ్ఱములు, ఏబదిలక్షల బంగారునాణెములు సమర్పించి తన దేశం వెళ్ళిపోయినాడు.

గోన గన్నారెడ్డి, ఆ యూపుననే ఏరువనాడంతయు నాక్రమించెను. ఏఱువనాటి సామంతుడు భీమప్రభువు రెండు సంవత్సరాలక్రితం తొండమండల ప్రభువైన కొప్పరుజింగ పల్లవుడు ఆంధ్రదేశంపై దండెత్తివచ్చి కంచి పట్టుకొన్నప్పుడు అతనికి సహాయము చేసెను. (ఏఱువనాడు ఇప్పటి కడప, నెల్లూరు, కర్నూలు జిల్లాలలోని భాగాలు కలిసినదేశం) కొప్పరుజింగ పల్లవుడు విక్రమసింహపురం పట్టుకొని మనుమసిద్ది అనే మనుమగండ గోపాలుని తరిమివేసి పాకనాడు, ఆరువేలనాడు, గృధవాడ విషయాలు గడచి రాజమహేంద్రవరము చెంత గోదావరి దాటి ద్రాక్షారామపురములో తన శాసనము వేయించెను.

ఇంతలో కాకతీయ సామంతులయిన చాళుక్యులు, కోన హైహయులు, వెలనాటిచోడులు, అంబరదేవుడు కొప్పరుజింగని సైన్యాలను నాశనముచేసి తొండ మండలమువరకు తరిమివైచిరి.

రాజేంద్రచోడుడు ఎత్తివచ్చుటకుముందే ఏఱువభీముడు తన సైన్యాలతో దొంగచాటుగా కొప్పరుజింగని దారినే వెళ్ళి, ద్రాక్షారామములో శాసనము వేయించి గోదావరీతీరమున మంత్రకూటమువరకు పోయి, దొంగదారులను కాకతీయ సైన్యాలను తప్పించుకొనుచు ఏఱువనాడు చేరెను.

రాజేంద్రచోడుని తరిమి కప్పము పుచ్చుకొని, ఏఱువభీమునిపై గోన గన్నయ్య ఇంద్రాయుధమువలె పడినాడు. భీమునిసైన్యాలు దూదిపింజలై ఆకాశములోనికి చెదరిపోయెను. ఏఱువనాడంతయు గాలించి, భీమనృపుని సామంతులను కొల్ల గొట్టి భీముని పట్టుకొన్నాడు. భీముడు గన్నారెడ్డి పాదాల వ్రాలి, సన్యాసియై దేశాంతరగతుడయ్యెను.

ఏఱువనాటికి సబ్బప్రభుని సామంతునిచేసి సింహాసన మెక్కించి ఆంధ్రదేశమును కన్నెత్తిచూచిన తొండమండలపు కొప్పరుజింగనికి బుద్ధి చెప్పుటకు గన్నారెడ్డి తొండమండలముపై దాడిచేసెను.