పుట:Gona gannareddy, Adavi Bapiraju.pdf/225

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

218

గోన గన్నా రెడ్డి

పిస్తవి. శుభముహూర్తకాలంలో ఉదయం భార్యా భర్తలను పీటలమీద కూర్చోపెట్టి దేవతాపూజ, అగ్నిహోత్రము చేయించారు. పెళ్ళికొడుకు ప్రద్యుమ్నుడులా, పెళ్ళికుమార్తె కామేశ్వరి, రతీదేవిలా ఉన్నారు. ఉద్దండ పండితుడైన అక్కినప్రగడ పునస్సంధాన మహోత్సవానికి పేరుగన్న పండితులందరూ వచ్చారు. ఆంధ్రపండితులు జగత్ప్రసిద్ధులు, నిష్ఠాగరిష్ఠులు, ఆంధ్రవైదికపాఠము జగత్ప్రసిద్ధము. కాశిలో, నవద్వీపంలో, నలందాలో, కంచిలో, ఢిల్లీలో, ఉజ్జయినిలో, ద్వారకలో, హరిద్వారంలో ఆంధ్రపండితుల కున్న గౌరవము అప్రతిమానము.

కవిసార్వభౌముడు, శబ్దవిద్యావిశారదుడు, యజుర్వేద పారగుడు ఈశ్వర భట్టోపాధ్యాయులు సభకు అధ్యక్షు డై నాడు. విద్యావాచస్పతి, త్రయీపాఠి, సోమనాథభట్టోపాధ్యాయులు, హరితసగోత్రుడు, వ్యాకరణ బృహస్పతి, బొమ్మనభట్టోపాధ్యాయులు, సకలశాస్త్రపారంగతుడు సూరదేవలుం గారును, గౌతమగోత్రికులు షట్చాస్త్ర సాగరులు దేవసభట్టోపాధ్యాయులు మొదలైన ఉద్దండపండితులు విచ్చేసిరి. శివాచార్యులు ఆరాధ్యదేశికులు విచ్చేసినారు.

శుభముహూర్తానికి వధూవరులు పీటలపై అధివసించినారు. కామేశ్వరి అప్పుడే పాలసముద్రస్థ అయిన లక్ష్మిలా ఉన్నది. అక్కినప్రగడ లక్ష్మినిచేబట్టిన నారాయణుడే!

ఆడవారు వైకుంఠంలా అలంకరించిన శయనమందిరంలో చేసిన వేడుకలు, ఆనందమహావీచికలే!

అందరూ వెళ్ళిపోయి తలుపులు వేసినారు. వధూవరుల తలుపులు విప్పారినవి. అక్కిన తన భార్యను హృదయానికి అదుముకొని ‘కామేశ్వరీ! ఈ గజ దొంగను ఇప్పటికైనా క్షమించవా?’ అని అస్పష్టవాక్యాలతో అడిగినాడు.

“మీరే నన్ను క్షమించాలి” కామేశ్వరి భర్తమోము లేత తమలపాకుల వంటి తన చేతులతో అదిమిపట్టి తన దెసకు తిప్పుకొని అన్నది.

“ఎందుకు?”

“మీకు అడ్డం రాబోయినాను.”

“నేను గజదొంగను అనుకొని, నన్ను శంకించినానంటావు?”

“అందుకు శిక్షవిధించండి.”

“రా, ఈ బాహువుల్లో నీకు ముందర బంధనము విధిస్తున్నాను! ఈ శిక్ష చాలునా?”

“ఇంతేనా మీ ధర్మశాస్త్రపారీణత?”

“ఏమిలోటు వచ్చింది?”

“నాకు మీరు చేసిన అపరాధానికి?”