పుట:Gona gannareddy, Adavi Bapiraju.pdf/226

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కృష్ణవేణి

219

“అదేమి చెప్మా?”

“నన్ను వదలిపెట్టి అంతకాలం ఉండడం?”

“పెళ్ళ యినప్పటినుంచే వెంటపెట్టుకొని తిరగమన్నావా?”

“ఎదురుప్రశ్న ప్రత్యుత్తరం కాదు?”

“తర్కపండితురాలవుకూడా!”

“మీ అర్ధదేహాన్ని కాదా!”

“మరి నాకు శిక్ష?”

“నా హస్తాలలో బంధనము ఒకటి!”

“నీ హస్తాలు వట్టిలతలు! రెండవశిక్ష?”

“రెండా? ఆరుశిక్షలకు మీ రర్హులు!”

“అమ్మయ్యో! ఏ సూత్రం? ఏ ధర్మశాస్త్రం?”

“వాత్స్యాయనం.”

“అమ్మదొంగా”

“మీరు గజదొంగలు, మీ ఇల్లాలిని నేనూ దొంగనే; మళ్ళీ దొంగా అంటారేమిటి?”

“నేను ఓడిపోయాను కామేశ్వరీ!”

కామేశ్వరి ప్రేమతో ఉప్పొంగిపోయింది. ఆమెకు తన భర్త తక్క మరో ప్రపంచమే లేదు. ఆ భర్త తనకు సన్నిహితుడై, విధేయుడైనప్పుడు, ఆమె ఆనందం మేరమీరినది.

ఆమె వెంటనే వంగి భర్తపాదాలంటి కళ్ళ కద్దుకొని ‘మీ పాదాలు సర్వ సౌందర్యనిధులు! వానిని పూజించి ఆత్మలో ధరించడానికి నేను తగను అని కన్నుల ఆనందబాష్పాలు రాల్చినది. ఆమెను ఒడిలో కూర్చుండబెట్టుకొని అక్కిన గాఢంగా హృదయాని కదుముకొన్నాడు.

7

మూడుదినాలు, ఉత్సవాలు అఖండంగా జరిగాయి. నాల్గవదినాన మగపెళ్ళివారు ఓరుగల్లు ప్రయాణం. అక్కిన ఓరుగల్లు వెళ్ళడమా, వెళ్ళకపోవడమా? అక్కినకు వెళ్ళడము ఇష్టంలేదు. వెళ్ళవలసిన ధర్మం. వెళ్ళితే అక్కినను బంది చేసి రుద్రచక్రవర్తి శిక్షిస్తుందా అనే ప్రశ్న సోమయామాత్యుల హృదయంలో ఆవేదన కలుగజేసింది. ఆయనకు తోచక కాలుగాలిన పిల్లిలా అయిపోయాడు.

పెద అక్కినప్రగడ రాతివిగ్రహంలా బిర్రబిగుసుకొని ఉన్నాడు. మాట లాడడు. ఆయన ఎదుటికి వెళ్ళడమంటేనే అందరికీ భయం.

గోన గన్నారెడ్డి చిన అక్కినప్రగడను పిలిచి ‘బావగారూ, నువ్వు మా చెల్లెలి ఆలోచనను అనసరించు నేనువెడుతున్నాను. కృష్ణవేణి నన్నుపిలుస్తున్నది.