పుట:Gona gannareddy, Adavi Bapiraju.pdf/173

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

166

గోన గన్నా రెడ్డి

ఒకనాడు కావ్యవిషయం వచ్చేది. రసము ముఖ్యమా, ధ్వని ముఖ్యమా, రీతి ముఖ్యమా అనే చర్చవచ్చేది. అలంకారానికి ఎక్కువ ప్రాధాన్యం ఈయకూడదని ఒకరంటే, ఇవ్వాలని ఒకరనేవారు. వారి వాగ్వాదాలలో ముమ్మడమ్మ చేరేది. ముమ్మడమ్మ ఒకసారి రుద్రమ్మతో చేరితే, పెక్కుసార్లు అన్నాంబికతో చేరేది. ఆనందానికి ఎక్కువ ప్రాముఖ్యం ఇచ్చేవారు అన్నాంబికా ముమ్మడమ్మలు. ఒక్కొక్కప్పుడు రుద్రాంబ భావానికీ, రసానికీ ఎక్కువ ప్రాముఖ్యం ఇచ్చి వాదించేది. ఆ సమయంలో అన్నాంబికా ముమ్మడమ్మలు రీతి, ధ్వనీ ఎక్కువ అని వాదించేవారు. వ్యాకరణం, తర్కం, వేదాంతం, గణితం అన్నీ వారి వాదనలలో నాట్యం చేస్తూ వుండేవి. మత సిద్ధాంతాలను చర్చించేవారు. అన్నాంబికా రుద్రాంబలు మాత్రమే వున్నప్పుడు, అన్నాంబ తన హృదయం అంతా రుద్రాంబకు ప్రస్ఫుటం చేసింది.

అన్నాంబిక: ఒక్క చూపులో హృదయం అర్పించుకోవడం సంభవమా అక్కా?

రుద్రాంబ: ఓసి వెఱ్ఱిపిల్లా! ఒక్కచూపులో, ఒక్కమాటలో, ఒక్క వినికిడిలో హృదయం అర్పించుకోవడం సంభవమే! కొన్నిఏళ్ళు కలిసి మెలిసి ఉన్నా, స్త్రీ పురుషులలో స్పందనం ఏమీ కలగకపోవచ్చును.

అన్నాం: ప్రేమ అనేది ఏమిటి? ఒక స్త్రీ పురుషుని కోరడం, ఒక పురుషుడు స్త్రీని కోరడమేకాదా?

రుద్రాం: ఓయి చెల్లీ, అది కామం అవుతుంది. ప్రేమ ఎట్లా అవుతుంది? స్త్రీకి తన పురుషుడు భర్త అవడానికి సావకాశం లేకపోయినా, ఆమె జీవితానికీ, ఆ పురుషుని జీవితానికీ పరమపవిత్ర సంబంధం ఏర్పడిపోతుంది.

అన్నాం: జీవితానికీ జీవితానికీ ఈ ప్రేమసంబంధము వేరవుతుందా లేక ఎన్నోరూపులతో ఆ పురుషుడే తిరిగి తిరిగి ఉద్భవిస్తూ ఉంటాడా?

రుద్రాం: చెల్లీ, ఇవన్నీ గడ్డుప్రశ్నలు. తర్కంప్రకారం ఆలోచిస్తే ఈ కారణాలూ లేవు. ప్రేమలూ లేవు!

అన్నాం: ఉన్నవి?

రుద్రాం: ఆత్మే! ఆత్మలన్నీ ఒక్కటిగదా! అలాంటప్పుడు ఒక ఆత్మ ఇంకో ఆత్మను ప్రేమించడం అనేది లేదుకాబట్టి సంపూర్ణజ్ఞానం లేనివారికే భౌతికమైన ప్రేమవాదన.

అన్నాం: అక్కా! నా వివాహం ఏర్పాటుచేసిన దినాన, ఒక పురుషుణ్ణి చూచాను. ఆ చూచినది మూడు నాలుగు క్షణికాలుమాత్రం. ‘ఆ పురుషునికొరకే నేను జన్మఎత్తినది’ అని నా హృదయానికి తట్టినది. నా కా వివాహం కాదని, ఆ