పుట:Gona gannareddy, Adavi Bapiraju.pdf/172

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కాకతమ్మ

165

హరిహర: లకుమయమహారాజా! మీ అన్నగారి కుమారుడని ఇంతకాలమూ సందేహించాము. ఇక ఆ గన్నయ్యను నాశనంచేసే ఎత్తు ఎత్తుదాము.

రుద్ర: మా మహారాజుగారికీ అందుకు అభ్యంతరములేదు. అయితే నా మనవి, మనం వేసిన పెద్ద ఎత్తుగడ నెగ్గితే, ఈ దొంగను నాశనం చేయడం ఎంతసేపు అని. జాయప మహారాజు మా సైన్యాన్ని నాశనం చేశాడని అనుకుంటున్నారు. అది వట్టిమాట. ఈ దినాన వర్థమానపురం పట్టుకోవాలంటే పది లక్షల సైన్యం వెళ్ళాలి!

మురారి: మహారాజా! మీరు వెంటనే ఈ నగరం వదిలి పారిపోయే వీలు కొరకు మేము అన్ని మార్గాలూ సిద్ధం చేస్తున్నాము. మా సైన్యమూ వృద్ధి అయినది.

లకుమయ: అవును, మనకు సర్వవిధాలా సహాయం చేస్తామని ఒక రహస్యమైన వేగువస్తూ ఉంటుంది. వారు ఎవరో తెలియలేదు!

హరిహర: ఆ పురుషు డెవరో నాకూ గ్రాహ్యం కావటంలేదు.

లకు: చోడోదయుడు పూర్తిగా మన పక్షమే చేరినాడు. మధుర పాండ్య మహారాజో, చోడమహారాజో అయి ఉంటాడని నా ఉద్దేశం. కళింగభూపతి కాదు. మేడిపల్లి కాచయనాయకుని విషయంలో వారు బయలుపడినారు. ఈ వార్త దక్షిణాన్నుంచే వస్తున్నదండీ!

లకుమయ: అదే మా అనుమానమున్నూ !

3

శ్రీ మల్యాల కుప్పసానమ్మ దేవేరి రెండేండ్ల క్రిందనే బుద్దపురం వెళ్ళిపోయింది. శివదేవయ్య మంత్రి ఆలోచన ప్రకారం అన్నాంబికాదేవిని, రుద్రమాంబాదేవి అంతఃపురంలో ఉంచి, కుప్పసానమ్మ వెళ్ళిపోయింది.

ఆవల తల్లి దగ్గరనూ ఉండక, ఈవల తాను ప్రేమించే వీరుని అక్కగారి కడనూ ఉండక, రుద్రమదేవి అంతఃపురంలో ఉండడానికి అన్నాంబిక కొంచెం బాధపడింది. కాని, రుద్రమాంబికాదేవి ప్రేమ చవి చూచీ, ముమ్మడాంబిక అపేక్ష కడుపార గ్రోలీ ఆమె చివరకు రుద్రాంబ నగరిలో ఉండడానికి ఒప్పుకొన్నది.

దుర్గాష్టమి కాకతమ్మ ఊరేగింపుకు రుద్రాంబతోపాటు పురుషవేషం వేసుకొని అన్నాంబిక తానున్నూ పట్టపుటేనుగుపై ఊరేగి తిరిగి నగరు చేరింది. వారిద్దరూ మాత్రమే ఉన్నప్పుడు అక్కాచెల్లెళ్ళుగా పిల్చుకొంటున్నారు. రుద్రాంబ నిజంగా అన్నాంబికా రాకుమారిని ఒక్క నిమేషం వదలి వుండలేకపోయింది. ఏ విషయం తాను ఆ బాలికతో చర్చించినా ఆమెకూడా చదువుకున్నదే అయివుండడంచేత, ఇద్దరకూ ఎంతో గాఢంగా చర్చ సాగేది.