పుట:Gona gannareddy, Adavi Bapiraju.pdf/165

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

158

గోన గన్నా రెడ్డి

సైన్యం అంతా బందీచేయగలిగాడు? తాను ప్రస్తుతం చల్లగా ఊరుకొని వీలు వచ్చిన వెంటనే మళ్ళీ యుద్ధసన్నాహం చేయడమా, లేకపోతే తెగబడి యుద్ధం చేయడమా?

తాను ఈ రాక్షసితో యుద్ధంచేయడంలో మేళ్ళు చాలా ఉన్నాయి. ఒకటి వాడకి అందుబాటులో లేనిదేశం. దేశంఅంతా తనవాళ్ళు. తనకు కొత్తసైన్యాలు వస్తాయి. వీడికి ఉన్న సైన్యమే, కోటలోఉన్న తినుబండారపు వస్తువులే వీడికి; తనకు దేశం అంతా ఉంటుంది. తాను మహాయుద్ధాలు చేయడానికి సన్నాహం చేశాడు. తెలిసిఉన్న తనకోట తాను పట్టుకోవడం సులభం. ఈ పిశాచిగాడికి కోట అనుపానులు తెలియవు.

అయితే తన ధనం కోటలో ఉంది. తన సైన్యాలకై తెచ్చిన ఆహారసామగ్రులు నగరంలోనూ, కోటలోనూ ఉన్నాయి. ఆ తిండితో , ఆ యుద్ధసామాగ్రితో వీడూ, వీడి సైన్యమూ ఆరునెలలు యుద్ధంచేయవచ్చును. అయితే తన నగరంలోని ప్రజలందరూ తనపక్షం.

ఈలా చేసినాడేమి? ఇంత నిర్భయంగా తన్ను ఇలా వదలివేయడంలో ఉద్దేశ మేమిటి? ఇంత గజదొంగ ఏదో కారణంలేక త న్నలా వదలిపెట్టునా? పై నుంచి ఈతనికి సహాయం ఏమివస్తుంది? ఎక్కడనుంచి వస్తుంది?

తాను గజదొంగను నాశనం చేస్తున్నాడు అని లోకం అనుకుంటుంది. గణపతిచక్రవర్తి ఈతని తలచూస్తే చాలా సంతోషం పొందుతాడు. వారందరూ ఈ గజదొంగను పట్టుకోవాలని ఏలాగూ చూస్తున్నారు; అందుకని ఈ దుర్మార్గుడు తెలివితక్కువగా తనకు ఇచ్చిన ఈ సావకాశాన్ని పోగొట్టుకోవడం ఎందుకు? తన నగరాన్ని తాను ముట్టడింపవలసినా, అదీ శుభమే! ఎలా అయినా తాను చక్రవర్తి అయ్యే శకునాలు ఎన్నో కనబడుతున్నాయి.

కాచనాయకుడు గన్నారెడ్డికడనుండి తన అంతఃపురంలోకి వెడుతూ ఆలోచించుకొన్నాడు. భార్యను, బిడ్డలను వెంటబెట్టుకొని శిబికలపై నెక్కి నగరం బైటకు వెళ్ళి అక్కడకు నాలుగుమైళ్ళు దూరంలోఉన్న తనసైనిక శిబిరంకడకు వెళ్ళాడు. అక్కడ ఉన్న తన సైన్యాధిపతులకు గజదొంగ గన్నారెడ్డి నగరమూ, కోటా ఆక్రమించుకొన్నాడనీ, తాము వెంటనే ముట్టడించాలనీ ఆజ్ఞ ఇచ్చి సాయంకాలానకు సర్వసైన్యాలతో నగరం ముట్టడించాడు.

ముట్టడించిన వెంటనే కాచయనాయకుని సైన్యాన్ని గన్నారెడ్డి రెండవ సైన్యం ముట్టడించింది. ఆ రాత్రి జరిగినయుద్ధం గోదావరీతీరంలో ఎప్పుడూ జరుగలేదని పెద్దలు చెప్పుతారు.

గన్నారెడ్డి సైనికులు రాత్రియుద్ధంలో ఆరితేరినవారూ, సర్వవిధాలా నిగ్గులు తేలిన కఱకుబంటులూ. వారికి రాత్రియుద్ధపు మాయలు ఎన్నైనా తెలుసును. కొద్ది మంది దెబ్బకొట్టి పారిపోవడం, ఒక అర్ధగవ్యూతి పారి పోయి వెనక్కు తిరగడం,