పుట:Gona gannareddy, Adavi Bapiraju.pdf/164

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గజదొంగ

157

గానే దుర్గరక్షకాధికారి పరుగున ఆ మందిరంలోకి వచ్చి, ‘మహాప్రభూ, కోటంతా గోన గన్నారెడ్డి గజదొంగలజట్టు నిండిపోయారు. కోటలో ఉన్న మన సైన్యాన్నంతా ఆక్రమించుకొని నిరాయుధుల్ని చేశారు. రాజప్రసాదాలన్నీ ఆ దొంగలు నిండిపోయారు. పురమంతా ఆ దొంగలే! మన ఎక్కడిసైన్యం అక్కడే నిలబెట్టి నిరాయుధుల్ని చేశారు. నేను వారి కందకుండా పారిపోయి తమకడకు వచ్చాను’ అని అతడు రోజుకుంటూ చెప్పినాడు. గన్నారెడ్డి అతన్ని చూచి పక పక నవ్వుతూ, ‘ఓయి దుర్గరక్షకుడా! నీ ఆయుధం రేచెరువుల ప్రభువు చేతిలో ఉందిలే! మల్లిరెడ్డి ప్రభువును ఎరుగవుకాబోలు! పోనీలే! ఇప్పుడు నీ ప్రభువునకు ఏమి ఆలోచన చెప్తావు?’ అని ప్రశ్నించాడు.

సూరన్నరెడ్డి మాట సముద్రంహోరే! ‘గన్నమహారాజా! ఈ మాటలన్నీ ఎందుకు? ఏదో మహాయుద్ధం జరుగుతుందని నన్ను అనవసరంగా మన కోట నుండి లాక్కువచ్చారు. కత్తి ఒరనుండి తీయనేలేదు! కోట ఎలాగా పట్టుకున్నారు. ఈ కాచభూపతిని మేడిపల్లిపురానికి అవతల విడిదిచేసిఉన్న అతని సైన్యాలకడకు పంపండి. ఆతడు సైన్యాల నన్నింటిని పంపివేసి తిన్నగా నిడుదప్రోలు శ్రీ ఇందుశేఖర మహారాజులంవారికి లోబడి వారు విధించిన శిక్ష అనుభవిస్తే మనదారిని మనం వెళ్ళుదాము. కాదంటారా మనతో యుద్ధం చేస్తాడు’ అని అతడు మనవి చేశాడు.

అవునవు నంటూ గన్నారెడ్డి చిరునవ్వు నవ్వుతూ ‘ఓయి కాచనాయకా! నువ్వు నా ఆలోచన వినదలచుకొంటే ఇప్పటికైనా బుద్ధితెచ్చుకొని మాకు పదిలక్షల బంగారు టంకాలు ఇచ్చి, నీ సైన్యం ముప్పాతికమందిని పంపించివేయి. ఆ వెనుక నిడుదప్రోలు ప్రభువు శరణివేడు, లేదా నిన్ను ఈ పరశువుతో ఖండ ఖండాలు చేసి కాకులకు గద్దలకు విసిరివేస్తాను. నడు, కోటలోనుంచి. నీకు నమ్మక ముంటే నీ కుటుంబాన్ని ఇక్కడ ఉంచు. నమ్మకం లేకపోతే కూడా తీసుకుపో. ఏ విషయమూ వెంటనే చెప్పు’ అన్నాడు.

ఉగ్రుడై మండిపోతూ కాచయనాయకుడు మాట్లాడకుండా ఆ మందిరంలో నుండి వెడలిపోయాడు.

10

కోటలోనూ నగరంలోనూ ఉన్న తన అయిదువేల సైన్యాన్నీ బందీలు చేసినాడు గాబోలు ఈ గన్నారెడ్డి గజదొంగ. వీ డెక్కడనుంచి వచ్చాడండీ! వీడికి తన విషయాలన్నీ ఎలా తెలిశాయి? వీడిని గురించి తాను విన్న విచిత్రాలన్నీ నిజమేనా? ఇంతదూరం ఎంతసైన్యంతో వచ్చాడు? ఎల్లా వచ్చాడు? ఎల్లా తన