పుట:Gona gannareddy, Adavi Bapiraju.pdf/163

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

156

గోన గన్నా రెడ్డి

కాచ: రజితపేటిక ఇక్కడకు ఎలావచ్చిందో ఎవరైనా చెప్పగలరా?

ఒకరక్షకస్త్రీ: మహారాజా! నే నా పెట్టెను తెల్లవారకట్ల మూడవయామం వెళ్ళిన గడియకు వస్తూ చూచానండి. కాని ఆ వెనుక ఏదో వుత్తరాలతో వచ్చే పెట్టెలవలె ఆ పెట్టె వుండడంచేత అలాంటిదే మళ్ళీ వచ్చిం దనుకొని చూచే ఊరకున్నాను. మహారాజా!

ఇంతలో ఆ మందిరంలోకి చిరునవ్వు నవ్వుతూ గోన గన్నారెడ్డి చేతిలో ఒక పరశువును ధరించి వచ్చాడు. అతని వెనుకే విఠలధరణీశుడు గద ధరించి వచ్చాడు. సూరనరెడ్డి మహాఖడ్గం ధరించి వచ్చాడు. వీరి ముగ్గురిని చూచి అక్కడ చేరిన రక్షకభటులు, సాయుధులూ, నిరాయుధులూ అందరు నిశ్శబ్దం అయిపోయినారు. కాచభూపతి నోటిలోనుండి రాబోయిన మాట అక్కడే ఆగిపోయింది. తెరిచిన నోరు తెరిచినట్లే ఉంది. అతని బుంగమీసాలు వణకిపోయాయి.

గోన గన్నారెడ్డి నవ్వుతూనే “ఓయీ కాచయనాయక ప్రభూ! నువ్వు నా వుత్తరంచూచి అంత భయపడిపోయా వేమిటి? నీకు పనికివచ్చే వుత్తరాలు వస్తే ఆనందమా? అప్పుడు నీ అంతఃపురరక్షకులు మంచివారా? ఇప్పుడు ద్రోహులైపోయారేమి! ఏమి ధర్మవిచారణ ధురీణుడవు! ఎవరో పిశాచులు కాకతీయ విరోధులు నీకు ధనం పంపిస్తే ధనాగారంలో దాచుకుంటావూ! నా చిన్న చురకత్తి వస్తే వంటింటికుందేలు వవుతావూ! ‘సర్వ సన్నాహం చేయి’ అని ఆ కటక జంతువులు నీకు వార్త పంపిస్తే శ్రీశ్రీశ్రీ గణపతిదేవచక్రవర్తిపై తిరుగు బాటు చేస్తావుగా! నేనురా, ఈ రాజ్యం దోచుకునేందుకు అధికారం కలవాణ్ణి. నా దొంగతనానికి నువ్వా అడ్డం వచ్చేది? శ్రీచాళుక్య వీరభద్రప్రభువు, శ్రీమహాదేవప్రభువు నిడుదప్రోలులోలేరని ఇదే అద ననుకున్నావు!” అని పక పక నవ్వాడు.

కాచప్రభువు దిగ్భ్రమచెంది, ‘ఓరి దొంగా, కన్నంవేసే ముచ్చూ! నువ్వట్రా నాకు నీతులు నేర్పేది?’ అని ఆంబోతులా రంకె వేశాడు.

గన్నారెడ్డి ‘అవునురా! నేను ముచ్చును, నీబలం దొంగిలించడానికి వస్తున్నానని వార్త పంపానుగా’ అని, ఆశ్చర్య మందినట్లు తమ్మునివైపు చూచి ‘విఠలప్రభూ! మనం వస్తామని వార్త పంపిస్తే ఈలా అంతఃపురరక్షకు లందరిని చుట్టూపెట్టుకొని నాటకమాడుతున్నా డేమిటి ఈ రాజద్రోహి?’ అని మెల్లగా ప్రశ్నించాడు.

విఠలధరణీశుడు సింహగర్జనలా నవ్వుతూ, ‘అన్నయ్యగారూ! మనం వచ్చామని గౌరవం చేయడేమిటి? రండి పోదాము’ అని పలికాడు.

కాచయనాయుడు ‘కోటలోకి ఎల్లావీరు వచ్చారు? ఇంత నిర్భయంగా ఎలా రాగలిగారు; ఎందుచేత వీరి కింత నిర్భయం? అని అనుకుంటూ వుండ