పుట:Gona gannareddy, Adavi Bapiraju.pdf/147

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

140

గోన గన్నా రెడ్డి

ఆ రాత్రి ‘ఏమయ్యా సబ్బనాయకా! మీ వేగులవారు పరిశీలించి తేల్చుకొని వచ్చిన విషయాలు కొన్ని కావాలి నాకు’ అని తన ఏకాంతమందిరంలోనికి సబ్బయ్య నాయకుని పిలిపించి గన్నయ్య అడిగాడు.

సబ్బ: మహారాజా! సైన్యం అంతా కృష్ణాతీరం పొడుగునా విడిశారు. మీ పినతండ్రిగారి శిబిరం శ్రీశైలందగ్గర ఉన్నది. వివిధ సైన్యాలన్నీ కలిపి ఒకలక్ష ముప్పదివేలమంది ఉన్నారు. ఆయన వేగులవారు ఈ ప్రదేశాలన్నీ సూదిని వెదికినట్లు వెదుకుతున్నారు. జల్లెడతో గాలిస్తున్నారు. ఎన్ని సారులు చూచినా ఈ దుర్గానికి మార్గం దొరకటంలేదు. ప్రభువుల ఆజ్ఞ చొప్పున మన దుర్గంలో ఒక్కదీపం, ఒకమంటకూడా రావటంలేదు. పగలు పొగరాకుండా వంటలు చేయిస్తున్నాను. అయినా మన దుర్గాన్ని వారు కనిపెట్టవచ్చునని ఏచారు డైనా రావచ్చు. అలా విడిగావచ్చిన చారులు మళ్ళీ వారికి కనబడ రనుకోండి. అయినా ఏ కొండశిఖరాన్నుంచో గమనించి, అనుమానించి సైన్యాన్ని తీసుకు రావచ్చు, వారు హతమారారే అనుకోండి. అయినా దుర్గరహస్యం బయలవుతుంది.

గన్న: అందుకనే నేను ఒక ఉపాయం ఆలోచించాను. మనవాళ్ళు రెండు మూడువేలమంది, రహస్యమార్గాన వీరి సైన్యాలకు దూరంగా కనబడి, వారిని ఆ అడవులలో తప్పుదారుల పట్టించాలి. ఇంకొకవేయిమంది, ఈ ఎగుడు దిగుడు కృష్ణవెంబడినే దిగువకు తీసుకొనిపోయి వాళ్ళపాట్లు వాళ్ళకుపెట్టాలి. ఇంకొక అయిదారు వందలమంది ముందు పరుగుతీయాలి. ఆ వెనుక వీరి సైన్యం ఎంత వస్తుందో రానీ, అలా పరుగుతీస్తూ కృష్ణ ఎగువకు లాక్కుపోవాలి. మూడు నాలుగు వేలమంది మన గజదొంగ పతాకం రాచటేనుగుకు కట్టి ఈ సైన్యానికి కనబడి దొరక్కుండా కందనోలుపోయి ఆ కోటలో ఉంటారు. ఈ గడబిడలో చిన్నాయనగారు ఏ సైన్యంలో ఉన్నారో నాకు వేగు అందించు. మా విఠలయ్యతో, సూరన్నరెడ్డితో, చినదామానాయనితో ఇతర నాయకులతో సంప్రతించి వారి వారిని ఆ యా పనులకు నియోగిస్తాను. నీ వేగు ఆ యా సైన్యాలకూ, ఇక్కడే ఉండే నాకూ ఎప్పటికప్పుడు వార్తలు అందజేయాలి.

సబ్బనాయకుడు చిత్తమని సెలవుపొంది మాయమయ్యాడు. గన్నారెడ్డి తాను వేసిన వ్యూహవిధానాల ప్రకారం వివిధ సైన్యాలను వివిధ స్థలాలకు పంపించాడు.

తాను మెరికలవంటి నూరుమంది దళపతులతో, సైనికులతో సబ్బానాయని కడనుండి వేగురాగానే రంగంలోకి ఉరకడానికి సిద్ధంగా ఉండెను. విఠలు డొక సైన్యాన్ని, సూరయ్యరెడ్డి ఒక సైన్యాన్ని, దామనాయుడొక సైన్యాన్ని, అక్కినమంత్రి ఒక సైన్యాన్ని నడుపుకుంటూ కృష్ణకు దూరంగా