పుట:Gona gannareddy, Adavi Bapiraju.pdf/146

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గజదొంగ

139

ప్రభువు తనయుడు. అతడు వేయని వేషం లేదు. ఆ రహస్యదుర్గంలోని సేనాపతులు ఒకరినొకరు చూచుకొని నువ్వు సబ్బప్పవు కాదుగదా అని ప్రశ్నించు కుంటారట. ఒకనాడు ఒక బాలనాయకుడు ఒక తేలును చంపుతూఉంటే, పక్కవారు ఆ తేలు సబ్బప్పేమో చంపవద్దన్నారట.

ఆ రహస్యదుర్గంలో కొలువుతీర్చిఉన్న గోన గన్నారెడ్డికి సబ్బప్ప ఒకనాడు ఒక లేఖామంజూషను తెచ్చి ఇచ్చినాడు. ఆ మంజూషచుట్టూ ఉన్న దారపు ముడిని సునాయాసంగా విప్పి గన్నయ్య శ్రీ శివదేవయ్య దేశికుల లేఖ చదువుకొన్నారు. వెంటనే ఆయన తనమంత్రి చినఅక్కినప్రెగడను చూచి “ఏమండీ అక్కినామాత్యులవారూ, మా బాబయ్యగారు లక్షలాది సైన్యం నడిపించుకొని ఈ చుట్టుప్రక్కల విడిదిచేసి ఉన్నారని మనకందరకూ తెలుసును. వారితో మా తమ్ముడు వరదారెడ్డిప్రభువు తన్ను తీసుకొనివచ్చిన దారి జ్ఞాపకం ఉంచుకొని తండ్రికి దారి చూపించి అంతవరకు తీసుకు రాగలిగాడు. కాని కళ్ళకు గంతలుకట్టి మనం మన దుర్గానికి తీసుకువచ్చాము. ఆ రహస్యదుర్గం కని పెట్టాలని ఇప్పటికి నెలరోజులనుండి మా చిన్నాయనగారు ప్రయత్నం చేస్తున్నారు. కాని ప్రయత్నాలన్నీ వృధా అయిపోయినాయి.

“ఇక్కడ శ్రీ శివదేవయ్య మంత్రులవారి ఉత్తరంచూస్తే ఒక విచిత్రం చేద్దామని తోస్తున్నది. మా చిననాయనగారిని మాయచేసి, ఒక్కణ్ణి బంధించి, ఓరుగల్లు చేర్పించి, అక్కడ శివదేవయ్య మంత్రులవారి చేతుల్లో పడేటట్లు చూద్దాము. వెంటనే మనం వెళ్ళి మా వర్ధమానపురపు కోటను ముట్టడిస్తాము. పట్టుకుందాము. అదికూడ చిత్రంగానే! వీనికి మీమీ ఉద్దేశాలు చెప్పండి” అని సభాముఖమై అడిగెను.

విఠలధరణీశుడు వెంటనే, ‘అద్భుతం’ అన్నాడు. సూరపరెడ్డి తలఊచాడు. చినదామానాయుడు చాలా బాగుందన్నాడు. అందరూ ‘వెంటనే’ అన్నారు. అప్పుడు చినఅక్కినప్రెగడ లేచి గన్నారెడ్డిని చూచి ‘ప్రభూ! తాము ఆలోచించినది సరియైనదేకాని మనం ఎందుకోసం ఈలా గజదొంగలం అయ్యామో ఆ ఉత్కృష్ట కార్యం అలా ఉండగానే వర్ధమానపురపుకోట పట్టుకోగూడదు. లకుమయను ఖైదీగా పట్టుకొని ఓరుగల్లు మహానగరం పంపిద్దాము. అంతే! ముందుంది ముసళ్ళ పండుగ! మీరే ఆలోచించండి’ అని మనవిచేశాడు. ఇరువదిఒక్క సంవత్సరం ఈడుగల అక్కిన తలఊపుతూ ఒక్కొక్కమాటే ఆలోచనాపూర్వకంగా ఈలా చెప్పినాడు.

గన్నారెడ్డి విని ‘అవును, అక్కినమంత్రీ మీ మాటలు నాకు నచ్చాయి. ఆలాగ చేద్దాము. మా చిననాయనగారిని రాత్రిరాత్రి మాయంచేయాలి. దానికి ఉపాయం ఈ రాత్రే ఆలోచిస్తాను’ అని చెప్పి లేచినాడు సభ ముగిసింది.