పుట:Gona gannareddy, Adavi Bapiraju.pdf/148

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గజదొంగ

141

ఒక ఎత్తయిన కొండమీదినుండి ఉన్న రహస్యమార్గంగుండా వారి వారి పనులు నిర్వర్తించడానికి వెళ్ళిపోయారు.

గన్నారెడ్డి ఒక వేగులవానికి ఏదో రహస్యాలు కొన్నిచెప్పి ఎచ్చటికో పంపించాడు.

మూడురోజు లైనవెనుక ఒక భయంకరమైన చెంచువాడు వచ్చి గన్నారెడ్డి ఎదుట నిలుచున్నాడు. గన్నారెడ్డి చెంచుభాషతో ‘ఏమిదొరా! నీ మొగం నాకు కొత్తదిగాఉంది’ అన్నాడు.

ఆ దొర మొగం చిట్లించుతూ ‘ఏమిదొరా! నా మొగం కొత్త అని పెబువులు నన్ను అవమానం చేయదలచుకొన్నారా’ అనుచు వంగి నమస్కరించి ‘ప్రభూ! నన్నే ఆనవాలు పట్టలేదా?’ అని సబ్బినాయని గొంతుకతో అన్నాడు.

గోన గన్నారెడ్డి పకపక నవ్వి ‘ఓయీ! అసాధ్యుడా! ఎంత మాయచేశావు! సరే, విషయాలు తొందరగా తెలుపు’ అన్నాడు.

సబ్బ: ప్రభూ! మీ పినతండ్రిగారు సైన్యాలన్నిటినీ మన సైన్యాలవెంట ఎండమావులవెంటబడిన పిపాసిరీతిగా పంపించాడు. తానుమాత్రం పదివేలమంది మెరికలవంటి సైన్యంతో శ్రీశైలంలోనే విడిదితీర్చి ఉన్నాడు. దినదినమూ పూజలూ పునస్కారాలు చేయిస్తున్నారు. చక్రవర్తిపై భక్తి ఉన్నట్లు వారి పేరున కొన్ని దానాలు ధర్మాలు చేసి దానశాసనాలు వేయించాడు. శ్రీశైలం మఠాలన్నీ పండుగలు చేసుకుంటున్నాయి.

గోన: శ్రీశైలంలో మన అనుయాయులు అప్రమత్తులై ఉన్నారా?

సబ్బ: చిత్తం, మీఆజ్ఞకోసం నిరీక్షించండని వారికి బోధించివచ్చాను, తమ శలవు.

గోన: సబ్బనాయకా! మీ పని అద్భుతము. ఉదయాస్తమానాలు మిమ్ము పొగడడంఅంటే నాకిష్టంలేదు! కాని అది తప్పటంలేదు. మీకు అద్భుతమైన బిరుదు అర్పించుకోగలను. అది తర్వాత. ఈ దినమే ఇక్కడ సాధారణంగా కాపలాఉండే వారుకాక తక్కినసైనికులు మారువేషాలతో శ్రీశైలనగర మహాక్షేత్రాన్ని చేరాలి. వారందరినీ శివాచార్యులుగా, శివభక్తులుగా, జంగమదేవరలుగా, ఆరాధ్యులుగా శ్రీశైల వివిధ మఠభక్తులుగా చేర్పించండి. నాగుర్తు ‘జయ మహాదేవ శంభో! పార్వతీనాథ!’ అని. దానికి ప్రతివచనసంజ్ఞ ‘త్రిలోక్య నగరారంభ మూలస్తంభాయ శంభవే!’ అని. ఇవి ప్రతివారికీ రావాలి. లేకపోతే చాలా తంటా ఉన్నది. రేపు రాత్రి శంభుమహోత్సవం, మైలారుదేవ ఉత్సవం. వీరభద్రపళ్ళెం పట్టించండి. మొక్కుబడి తీరేందుకుగాను ఎవరో ధనవంతుడైన భక్తుడు ఉత్సవం చేయిస్తున్నాడు. నువ్వొక శివాచార్యుడవు. నీ ఐంద్రజాలమంతా చూపించాలి. రేపురాత్రంతా ఒళ్ళుతెలియని ఉత్సవాలు. మా చిననాయనగారి సైన్యాలు అనేక