పుట:Gona gannareddy, Adavi Bapiraju.pdf/138

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఓరుంగల్లు

131

నయంకదూ? నీ హృదయం అంతా నా కర్థమైంది. నీ తండ్రికి విరోధీ - గజదొంగా, నీ సార్వభౌమునకు విరోధీ - అపఖ్యాతికి నీడై వెన్నాడేవాడూ నాయకుడా? కష్టసుఖాలు దరికిచేరని రాణివాసంలో కుసుమకోమలి, ఒక మనోహరాంగి - నాయికా? ఈలాగే ఉంటాయి తల్లీ లోకంపోకడలు.’

“ఒక సార్వభౌముని కొమరిత, భావిచక్రవర్తిని - నాయిక! ఉత్తమ సామంతుడు, వీరుడూ - నాయకుడూ. స్త్రీలకు స్వాతంత్య్రం లేదు. అక్కగారూ! పురుషులకు స్వాతంత్య్రం ఉందంటాము. నిజంగాలేదు. పురాణాలలో ఒకరికై ఒకరు పుట్టి, ఒకరినొకరు ప్రేమించి, ఒకరినొకరు చేరడానికి ఎన్నో బాధల నంది చివరకు మనోరథసిద్ధి పొందుతారు. కాదా అక్కగారూ?”

“కాళిదాస కుమారసంభవంలో పార్వతి శివునికై విరాళి - లాభంలేక తపస్సు - అప్పుడు శివుడు పార్వతిని ఇదివరకే ప్రేమించి ఉన్నాడు గనుక వివాహం చేసుకుంటాడు. రామునికై సీత ఉద్భవించింది, వారిద్దరివివాహము అడవుల పాలు - లంకానగరశోకవనవాసం, లంకాయుద్దం - అగ్నిపరీక్ష - పట్టాభిషేకం! మన చరిత్రలు అల్లాఎందుకుంటాయి చెల్లీ? మనకీ రాజ్యాలు వద్దు. చక్కని నగలు, అందమైన వస్త్రాలు, ముద్దులుగులికే బిడ్డలు, కోరినభర్త! అవీ కావలసినవి. మనలో బడాయి లున్నాయి. గర్వం ఉంది. రాణులుగా ఏడాదికోసారి మనం నగలతో, అద్భుతమైన వస్త్రాలతో ప్రజల కంట బడుతాము. అప్పుడేగద మన అందాలను, ఐశ్వర్యాలను లోకమూ, లోకంలోని స్త్రీలూ చూచి మెచ్చుకొనేది చెల్లీ!”

అన్నాంబిక నిట్టూర్పు విడిచింది.

“ఇంకముందు మన జీవితం మన నాథులు, మన బిడ్డలు, సాధారణ భార్యలులా మనం భర్తజీవితంలో జీవితమై, అతని సంతోషం, అతని పాటు, అతని కృషి, అతని చెమట, అతని బాధ, అతని పశుత్వము చూచి, అతడు మన కృషీ, మన మాతృత్వము, మన దాసీత్వము, మన సంతోషం, మన బాధ, మన ఆట, మన పాట చూస్తూఉండగా - నాగలి లాగే రెండు పశువులూ, పడవను నడిపే చుక్కానీ గాలులుగా జీవితయాత్ర సాగించడానికి వీలుందా చెప్పు!”

అన్నాంబిక ఆశ్చర్యంతో మహారాణిని చూచింది.

“అంతఃపురాలలో పంజరాలలోని చిలుకలులా ఉండి, భర్త ఎప్పుడు వస్తే అప్పుడు పుత్తడిబొమ్మలులా వేషాలు వేసుకొని, మన అందాలు, మన భూషణాలు, మన చీరలు చూచేది మన దాసీలే అయినా సపత్నుల గొడవలలో పడి, కృంగి, కృశించి, మనబిడ్డలకు మనం పాలిచ్చుకోవడానికి వీలులేక, మన వంటలు మనం తినడానికి వీలులేక, అవసరమైన కూరలు, భక్ష్యాలుతింటూ, ఆరోగ్యంలేక, అందంపోయి నగలూ, చీరలే అందాలైతే రహస్యంగా ఏడ్చి