పుట:Gona gannareddy, Adavi Bapiraju.pdf/137

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

130

గోన గన్నా రెడ్డి

తిరిగి సంపాదించుకోవాలని అనుకున్నాడేమో? వీటి అన్నిటికీ ఏమిగాని అన్నాంబికా రాకుమారీ! నువ్వు నాతో కొద్దిదినాలు ఉండుతల్లీ! కుప్పాంబికాదేవీ నాకోర్కె పాలించి ఈ బాలికను నాతో కొన్నిదినాలు గడపనీయండి.

కుప్పాం: మహారాణీ! తమ ఇష్టమే మాకు శాసనం. అవశ్యం ఉంచుకోండి. అమ్మాయి కవయిత్రి, అద్భుత గాంధర్వవిద్యా విలాసిని. ఆమెను మీరు వినితీరాలి.

15

ఆ సాయంకాలము రుద్రాంబ, అన్నాంబికా తోటలో విహరించారు. ఆ రాత్రి చుక్కలక్రింద కూర్చున్నారు. అన్నాంబిక రుద్రదేవికి తాను రచించిన పాటలు వీణ వాయిస్తూ మధురకంఠంతో పాడి వినిపించింది.

1

“శివుని శిఖపై వెలుగి చిన్నారి నెలవంక
 భవురాణి భ్రూమధ్య ప్రసరించి వెలుగు
 శివుని పెదవులనాడు ధవళ చంద్రజ్యోత్స్న
 భవురాణి చూపులో పర్వి లోకము నిండు.
 నా వియోగములోన నాతి వెన్నెలయేది?
 నా నవ్వులని చేరె నళినాక్షి చంద్రుణ్ణి.

2

“దొంగవాడట కృష్ణుడూ వెన్న
 దొంగిలించెడువాడె వెన్నుడూ
 దొంగలకు గురువటే దొంగలకు దేవుడటె
 అంగసల హృదయములు దొంగిలించెడువాడె
                                      దొంగవాడట......
 వలువలను హరియించి వనిత ఎక్కెనె పొన్న
 కలగని మనసుతో చెలువ వేణువునూదు
                                   దొంగవాడట.......

ఈ పాటలను పాడుతూఉంటే అన్నాంబిక కంఠంలోనుంచి ప్రవహించిన గాంధర్వవాహిని అలకనందలా అత్యంతశీతలమై భయంకరమై గజగజ వణికించింది. రుద్రాంబిక అన్నాంబికను తన హృదయాని కదుముకొని గట్టిగా కౌగిలించు కొంది. రాజ్యరథాశ్వపాశాలను ధరించిననూ కోమలమైన తన రెండుచేతులా అన్నాంబిక చెంపలబట్టి మోమెత్తి ఆమె కన్నులలోకి చూచి ‘చెల్లీ! నీవున్నూ నావలెనే బాధపడుతున్నావా? మనకన్న వ్యవసాయం చేసుకొనే రెడ్డిబిడ్డ