పుట:Gona gannareddy, Adavi Bapiraju.pdf/139

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

132

గోన గన్నా రెడ్డి

ఏడ్చి కావ్యాలలోనూ శాసనాలలోనూమాత్రం ఎక్కి అదే పదివేలనుకొని సంతోషీస్తాం చెల్లీ!”

అన్నాంబిక కన్నుల నీరు క్రమ్మెను.

“రాజ్యంకోసం ఆ రాజకొమరుని పెండ్లి చేసుకోవాలి మనం! ముక్కూ మొగం ఎరుగము మనం. రాజ్యాలు పాలించే ప్రభువుల బిడ్డలము, రాజ్యాలు పాలించే ప్రభువుల భార్యలము, రాజ్యాలుపాలించే బిడ్డల తల్లులము. అందుచేత మన చుట్టూ గోడలు, మనపైన గోడలు, అనుకున్నచోటికి వెళ్ళడానికి వీలులేదు. వెళ్ళడానికి ఇష్టంలేకపోయినా, వెళ్ళవలసినచోటికి వెళ్ళితీరాలి.”

అన్నాంబిక రుద్రదేవి ఒళ్ళో వాలిపోయింది.

“రాజ్యాలకోసం అన్నదమ్ముల పోట్లాట, నాశనంచేసుకొనడం, మామకూ, అల్లుడికీ, బావమరదులకూ యుద్ధాలు - కౌరవయుద్ధం! చాళుక్య గణక విజయాదిత్య రాష్ట్రకూట కృష్ణరాజ యుద్ధం! ఏమి భయంకరమమ్మా ఈ రాచపుట్టువు?”

ఈ ఉపన్యాసం అంతా తెల్ల బోయి విన్నది అన్నాంబిక. ఆ బాలిక కన్నుల దొనదొన నీరు పొంగింది, జలజల అశ్రులు రాలిపోయాయి. రుద్రదేవి ఒడిలో తలపెట్టుకొని, నిర్వచింపరాని ఆవేదనతో కరిగిపోయింది రుద్రదేవి ఆ బాలికను మళ్ళీ కౌగిలిలోకి తీసుకొని “చెల్లీ, ఈ క్షణంలో నేను ఆంధ్ర సామ్రాజ్యానికి రాజప్రతినిధినీకాను, నువ్వు ఆదవోని మండలేశ్వరుల తనయవూ కావు. నువ్వు బాలికవు, నేను బాలికను. నువ్వు గన్నారెడ్డిని ప్రేమిస్తున్నావు. నేను చాళుక్య... చాళుక్య వీరభద్రుని ప్రేమిస్తున్నాను. నువ్వు కొంచెం నాకన్న నయం....”

అన్నాంబిక తలఎత్తి - కంటనీటితో ఉన్నా - మోము ప్రపుల్ల మై వికసించి వానతో తడిసిన పూర్ణకమలంకాగా నవ్వుతూ ‘మహారాణీ.....’ అని ఏదో చెప్ప బోయింది. వెంటనే రుద్రదేవి ఆ బాలిక నోరు మూసి “చెల్లీ, ఒంటరిగా వున్నప్పుడు, నేను నిన్ను ‘చెల్లీ!’ అంటాను. నన్ను నువ్వు ‘అక్కా!’ అని పిలు, తెలిసిందా? లేకపోతే నేను నువ్వు ఊహింపలేని బాధపడతాను. ఇది మనిద్దరి మధ్యా రహస్యం తల్లీ!” అన్నది. అప్పుడు అన్నాంబిక పకపక నవ్వుతూ లేచి నాట్యంచేస్తూ,

“తెలిసిందమ్మా నాకొక తియ్యని కమ్మని రహస్యమూ,
 దీనులపాలిటి మందారమ్మొక దేవికి మెత్తని హృదయమ్మూ;
 బంగారపు బొమ్మలకైనా పల పల మనునే ప్రణయమ్మూ
 పుత్తడి బొమ్మకు హృదయములోనే పురుషుడొక్కరు నివాసమ్మూ”

అని కిలకిల నవ్వింది

రుద్రదేవి ‘దొంగపిల్లా, అల్లరిచేస్తావా? నీపని ‘పడతా ఉండు’ అంటూ పీఠంనుంచి లేచి పరుగున వచ్చింది. అన్నాంబిక అందకుండా పరుగెత్తింది.