పుట:Gona gannareddy, Adavi Bapiraju.pdf/133

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

126

గోన గన్నా రెడ్డి

కా భాగ్యమే కలిగితే ఏ రాజక్షోభమూలేని సాధారణకన్యయై, జీవితరహస్యం తాను తెలుసుకోగలదు.

తన తండ్రి, తన గురువులు ఇరువురూ తా నెన్నిసారులు తన కీ రాజ్యం అక్కరలేదన్నా, ‘నీవు రాజ్యభారం వహించవలసినదే’ అని ఖండితముగా చెప్పినారు. తాను తండ్రిమాట వ్యతిరేకించడానికి సాహసించినా, భగవంతుని అవతారమైన గుర్వాజ్ఞ ఎట్లు వ్యతిరేకించగలదు?

సామంతులలో కుట్రలు, రాజద్రోహం; ప్రజలలో కలహాలు, వ్యాధి కాటకాల విజృంభణ, అతివృష్టి, అనావృష్టి బాధలు పొరుగురాజ్యాలవారి కాంక్ష ఇవన్నీ భరించవలసిన రాజధర్మ మెంత భయంకరము?

తాను స్త్రీయై, ఆనందజీవితయాత్రోన్ముఖవధువై, గృహిణియై, బిడ్డల తల్లియై, బహుకుటుంబినియై, సంసారయాత్ర సాగించవలసిన బాలిక! ఈలా కఠిన రాజ్యధర్మము నిర్వహించడం ధర్మవ్యతిరేకం కాదని తన గురువులిరువురూ తలవడం ఏలా పొసగిందో తన కిప్పుడు గ్రాహ్యంకాని విషయమే అయినది. అట్లు చేయకపోవడ మధర్మమనికూడా దేశికులు బోధించాడు. ‘రాజ్యార్హతకలిగి రాజ్యం చేయనివాడూ, ఋతుస్నాతయై పతినికోరిన భార్యను జేరనివాడూ, కలిగి యుండి అన్నార్తునకు భోజన మిడనివాడూ ఘోరపాపాల నాచరించినవాళ్ళు’ అని గురువుగా రుపదేశించారు.

తాను స్త్రీయని ప్రకటించి దేశికులు మంచిపనిచేశారు. తనకు సోదరులు లేనప్పుడు, తండ్రికి సోదరులు లేనప్పుడు, పెదతాతగారికి బిడ్డలు లేనప్పుడు, కాకతీయవంశానికి తా నొక్కతే రాజ్యార్హతకలదని నిర్ణయింపబడినయపుడు తాను రాజ్యం స్వీకరింపకుండా ఏలా ఉండగలదు?

ఈ విషయమై తనకూ, తండ్రిగారికీ, తమ దేశికులకూ దీర్ఘవాదోప వాదాలు జరిగినవి. తాను తనతండ్రివెనుక రాజ్యం చేసితీరవలసివచ్చింది. అలాటి ధర్మనిర్ణయం జరిగినవెనుక తన సర్వశక్తులతో మనోవాక్కాయ కర్మలచే ఆ ధర్మాన్ని ఆచరించితీరుతుంది. అది తన తపస్సు, తన జీవితం. తన ఆత్మ.

అలాంటి తపోమయ జీవితంలో పురుషుడు ప్రవేశించడానికి తావేది? పురుషుడుగా, హృదయేశ్వరుడుగా, ఆత్మనాథుడుగా తనకు ఈ రెండు మూడు నెలలలో ప్రత్యక్షమైన ఆ దివ్యుడు తనకు కాడు. ఆ రూపము, గంభీరకంఠ మాధుర్యము తనకు దూరం కావాలి.

“స్వయంభూనాథా! నేను అబలను. అసహజమైన పురుషధర్మం నేను నిర్వహించాలి. యుద్ధంలో సైన్యాలను నడిపించుకొని విరోధులపై దండెత్తి, పరస్పర విరోధిసైనికులు, నాసైనికులు నాశనమవుతూంటే చూడాలి!